జాతీయ ఇన్‌‌‌‌స్పైర్ అవార్డుల్లో మన స్టూడెంట్ల సత్తా.. 62 ఉత్తమ ప్రాజెక్టుల్లో ఐదు తెలంగాణ నుంచే ఎంపిక

జాతీయ ఇన్‌‌‌‌స్పైర్ అవార్డుల్లో మన స్టూడెంట్ల సత్తా.. 62 ఉత్తమ ప్రాజెక్టుల్లో ఐదు తెలంగాణ నుంచే ఎంపిక
  • కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
  • సకురా సైన్స్ ప్రోగ్రామ్ కింద ఆయా స్టూడెంట్లకు జపాన్‌‌‌‌ టూర్​కు చాన్స్  
  • విద్యార్థులకు సీఎం రేవంత్‌‌‌‌, విద్యాశాఖ అధికారుల ప్రశంసలు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ వేదికగా జరిగిన 12వ జాతీయ ఇన్‌‌‌‌స్పైర్ అవార్డ్స్– మానక్ సైన్స్ ఎగ్జిబిషన్‌‌‌‌లో తెలంగాణ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. తమ వినూత్న ఆలోచనలు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచే ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. 

దీంతో అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలోని కర్నాటకకు 9 అవార్డులు రాగా, రెండో స్థానంలోని మహారాష్ట్రకు 7 అవార్డులు నిలించాయి. ఆ తర్వాత 5 అవార్డులతో తెలంగాణ మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. గతేడాది రాష్ట్రం నుంచి కేవలం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఎంపిక కాగా, ఈసారి ఏకంగా ఐదు అవార్డులు దక్కడం విశేషం.

పాల్గొన్న 52 మంది విద్యార్థులు 
ఈ నెల12 నుంచి 14 వరకు జరిగిన ఈ జాతీయ స్థాయి ప్రదర్శనలో దేశవ్యాప్తంగా సుమారు 780 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 62 అత్యుత్తమ ఆవిష్కరణలను జాతీయ గుర్తింపునకు ఎంపిక చేశారు. దీనిలో తెలంగాణ నుంచి 52 మంది విద్యార్థులు పాల్గొనగా, ఐదుగురు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.

బుధవారం జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌‌‌‌లో జరిగే సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 

అవార్డులు సాధించింది వీరే..
జాతీయ స్థాయిలో సత్తా చాటిన మన విద్యార్థుల ప్రాజెక్టులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌లోని భారతీయ విద్యాభవన్ విద్యార్థిని వైష్ణవి గోవర్ధన ‘ఈ–క్లాడ్ స్మార్ట్ డ్రైనేజీ’ ప్రాజెక్టుతో అవార్డు దక్కించుకోగా, డ్రైవింగ్ సమయంలో ప్రమాదాల నివారణకు హెల్త్ అలర్ట్స్ ఇచ్చే ‘స్మార్ట్ స్టీరింగ్’ రూపకల్పనతో సూర్యాపేట ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ విద్యార్థి కొల్లు మహిధర్ జాతీయ గుర్తింపు పొందాడు.

హైదరాబాద్ బేగంపేట వీబీఎస్ దేవనార్ బ్లైండ్ స్కూల్‌‌‌‌కు చెందిన అంధ విద్యార్థి రెహాన్ రజా చూపులేని వారి కోసం రూపొందించిన ‘మెడిసిన్ బాక్స్’ అందరి ప్రశంసలు అందుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌చెరు ఆరిజిన్ టెక్నో స్కూల్ విద్యార్థిని చౌదపూరి సాయి మేఘన పోలీసుల రక్షణ కోసం పెప్పర్ స్ప్రే, బ్లైండింగ్ ఎల్‌‌‌‌ఈడీతో కూడిన ‘యాంటీ రాయిట్ షీల్డ్’తో అవార్డు సాధించగా.. సంగారెడ్డి భెల్ భారతీయ విద్యాభవన్ విద్యార్థి ఎన్. పూర్ణిత్ రెడ్డి చూపులేని వారి కోసం రూపొందించిన ‘స్మార్ట్ ఈ–గాగుల్స్’తో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు.

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అభినందనలు
జాతీయ స్థాయిలో సత్తా చాటి రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపిన విద్యార్థులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనేలా సరికొత్త ఆలోచనలతో విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించడం పట్ల ప్రశంసించారు.

ఆయనతో పాటు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ విజేతలకు, గైడ్ టీచర్లకు అభినందలు తెలిపారు.