వెలుగు స్పెషల్: ప్రతి డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. నీటి నియమావళి కావాలి

వెలుగు స్పెషల్: ప్రతి డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. నీటి నియమావళి కావాలి

నీటి సంక్షోభంపై గత ఏడాదిగా హెచ్చరికలు వినపడుతున్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాటిని గుర్తించింది.  ప్రభుత్వ నాయకులు తమ ధోరణిలో హెచ్చరికలు, విజ్ఞప్తులతో ప్రకటనలు చేస్తున్నారు. కానీ  తీవ్ర, కఠిన నెలలు ఇంకా ముందున్నప్పటికీ  ప్రభుత్వం ఏం చేయాలను కుంటోందో ఈ ప్రకటనల్లో కనిపించడం లేదు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, 2027 ఫిబ్రవరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 

కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పెద్ద,  మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఉపయోగకర నిల్వ గత ఏడాది స్థాయిలో సుమారు సగానికి పడిపోయింది. భూగర్భ జలమట్టాలు దారుణంగా తగ్గుతున్నాయి. ఫలితంగా, అదనపు విద్యుత్ ఇచ్చినా యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రైతులు నీటి కొరత ఎదుర్కొనే అవకాశం రోజురోజుకూ బలపడుతున్నది. రాబోయే ప్రతి నెలా గత నెలకన్నా కఠినంగా ఉండే అవకాశం ఉంది.  ఇలాంటి సంక్షోభంలో లభ్యత ఉన్న నీటిని ఒక రాష్ట్రం ఎలా  వినియోగించుకుంటుంది అనేది ముందుగా సిద్ధం చేసిన నియమాలపై ఆధారపడుతుంది.  తెలంగాణలోని చాలా జలాశయాలకు ప్రజలకు అందుబాటులో,  అర్థమయ్యే రీతిలో,  చదవగలిగే రూపంలో అలాంటి నియమాలు లేవు.  నీటి కొరత భయాందోళనల పరిస్థితికి దారితీయకముందే డ్యామ్‌‌వారీగా నియమావళిని తక్షణమే రూపొందించాలి. 

హైదరాబాద్ నీటికోసం కట్టిన  సింగూరు జలాశయం ఇప్పుడు దాదాపు అందరికీ నీరందిస్తోంది.  ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది.  హైదరాబాద్ నగరానికి తాగునీరు దాని ఉపయోగాల్లో ఒకటి.  కాలక్రమంలో ప్రజలతో చర్చ, సంప్రదింపులు లేకుండానే ఇతర ఉపయోగాలు చేరాయి.  మిషన్  భగీరథ కింద ఇది నాలుగు జిల్లాల్లోని 2,395 గ్రామీణ ఆవాసాలకు, 18 పట్టణ స్థానిక సంస్థలకు నీరందిస్తోంది. అదే సమయంలో సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తోంది.  

పలు పారిశ్రామిక,  సంస్థాగత కేటాయింపులు ఉన్నాయి.  దిగువన  ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఆనికట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా నీరు విడుదల చేస్తోంది.  సింగూర్ జలాశయంపైన ఏర్పడిన ప్రతి వినియోగ హక్కూ ఒక పరిమాణమే. ఈ పరిమాణాలు చూస్తే హైద  రాబాద్ జలమండలికి ఏడాదికి 6.96 టీఎంసీలు, మిషన్ భగీరథకు 5.70 టీఎంసీలు, సాగునీటికి 2.00 టీఎంసీలు ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని పారిశ్రామిక జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2018లో  షరతులతో 1.42 టీఎంసీలు కేటాయించారు.  నీరు తగ్గినప్పుడు ఈ పరిమాణాలు, విడివిడిగాకానీ, నిష్పత్తిలోకానీ, ఎలా మారతాయో చెప్పే  ప్రణాళిక లేదా పత్రం మాకు కనిపించలేదు.  ‘తాగునీటికే  మొదటి ప్రాధాన్యం’ అనే సూత్రం, 2012 నాటి జాతీయ నీటి విధానం కూడా ఈ సమస్యను తేల్చదు. 

పాలనాపరంగా నియమావళి లేదు

 హైదరాబాద్ నగరానికి, భగీరథ పథకం కింద ఉన్న వివిధ ప్రాంతాల మధ్య నీటి కేటాయింపు ఏవిధంగా నిర్ణయిస్తారు. తాగునీటికి  సరఫరా చేసే పైపుల నుంచి పరిశ్రమలకు కూడా ఇస్తున్నారు.  నియమావళి లేకుంటే ఉపయోగాలు వేరు చేయడం కష్టం. గత 43 ఏండ్లలో సింగూర్ గురించి అనేక ప్రభుత్వ ఉత్తర్వులు దేనికవే వేరుగా ఉన్నాయి. అన్నీ ప్రజలకు అందుబాటులో లేవు.  అందుబాటులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం హామీ ఇచ్చిన కేటాయింపులన్నీ కలిపి ఏడాదికి సుమారు 16 టీఎంసీలు అవుతాయి. 2026 అక్టోబర్ 17న జలాశయంలో 3.42 టీఎంసీలు మాత్రమే ఉంది.  సరఫరా నవంబర్ 9 వరకు, అత్యవసర పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  డిసెంబర్ 10 వరకు సాగవచ్చని అంచనా.  నీటి కొరత ఉన్న నేపథ్యంలో వివిధ రంగాల కేటాయింపులను ఏ పద్ధతిన తగ్గిస్తారు?  ఈ  తగ్గింపులకు శాస్త్రీయంగా, రాజకీయంగా, పాలనాపరంగా నియమావళి లేదు. సింగూర్ జలాశయంలో ఉన్న నీటిని,  ఇతర నిల్వలను అధికారులు  ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమానంగా పంచేవిధంగా స్పష్టంచేసే  నియమావళి, సూత్రాలు లేవు.

జలాశయంలో  నీటినిల్వపై  సంశయం

జలాశయంలో నీరు ఎంత ఉంది అనే సాంకేతిక అంశంలో కూడా సంశయం ఉన్నది.  ప్రకటిస్తున్న నీటి నిల్వ స్థాయిలు,  దానికి తగ్గ కేటాయింపులు ఒకదానితో  ఒకటి  సరిపోవడంలేదు. 2017 ఉత్తర్వు మిషన్ భగీరథ నీటిని కాపాడేందుకు జలాశయాన్ని 520.5 మీటర్లకు పైన ఉంచాలని చెబుతోంది. 2009 ఉత్తర్వు 516 మీటర్లను  నీటిపారుదల కోసం ఎత్తిపోతకు వీలయ్యే స్థాయిగా పరిగణిస్తోంది. డ్యామ్ భద్రత సమీక్ష ప్యానెల్ 517.8 మీటర్ల డిజైన్ పరిమితికి పైన సంవత్సరాల తరబడి నీటిని నిల్వ ఉంచినట్లు గుర్తించిందని నివేదికలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం నిల్వ 515 మీటర్ల కన్నా తక్కువే. ఈ సంఖ్యలను ఎవరైనా బహిరంగంగా సమన్వయం చేసినట్టు మాకు కనిపించలేదు.  ప్రస్తుత తక్కువ నిల్వలో ఎంత ఉద్దేశపూర్వకంగా తగ్గించారు (మరమ్మతుల కోసం జలాశయాన్ని ఖాళీ చేశారని నివేదికలు చెబుతున్నాయి).  కేంద్ర జల సంఘం 30 ఏళ్లలో ఉపయోగకర సామర్థ్యంలో సుమారు 1.3 శాతం నష్టాన్ని మాత్రమే గుర్తించింది. అయితే  పూడిక మీద కూడా సమాచారం లేదు.  నిల్వస్థాయి సరిగ్గానే ఉన్నా, పూడిక వల్ల నీటి పరిమాణం తగ్గుతుంది అన్నది తెలిసిందే.

 ప్రతి డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక నియమాల చట్రం

నీటి విడుదలకు, జలాశయ యాజమాన్యానికి తగిన నియమాలు ఎక్కడా కనిపించవు. సింగూరు కార్యాచరణ నియమాలను నిర్దేశిస్తుందని ప్రభుత్వమే ఉదహరించే 1990 నాటి ఉత్తర్వు ప్రజలకు అందుబాటులో లేదు. దిగువ రైతులకు విడుదల నియమాల ప్రకారం అంటూనే,  ఆ నియమాలేమిటో  చెప్పకుండా, ఒక్కో ఉత్తర్వుతో అనుమతిస్తున్నారు. ప్రతి డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక నియమాల చట్రం, ప్రతి డ్రాడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నమోదైన కారణం ఉండాలని నీటిపారుదల శాఖ 2023 మాన్యువల్ చెబుతోంది. సింగూరుకు ఈ రెండింటిలో ఏదీ మేం చూడలేదు. నీటి విడుదల కొలత కూడా లేదు. 

జలాశయం నుంచి తీసుకునే ప్రతి వినియోగాన్ని చూపే బహిరంగ రిజిస్టర్ లేదు. 1989లో పూర్తయిన ప్రాజెక్టుపై ఇంతవరకు హైడ్రోగ్రాఫిక్ సర్వే జరగలేదని 2020 కేంద్ర జలసంఘం అధ్యయనం చెబుతున్నది. నిల్వ సుమారు 3 టీఎంసీల కన్నా తగ్గితే తాగునీరు తీసుకోవడం సాధ్యం కాదని 2026  జులైలో  మిషన్  భగీరథ ఇంజినీర్ ఒకరు చెప్పారు. అది చాలా కీలకం.  కానీ  అది  ప్రజలకు ఒక పత్రిక ద్వారా మాత్రమే చేరింది.

ఆదాయ వనరుగా సింగూరు

సింగూరు ఆదాయ వనరుగా కూడా మారింది. కానీ -తగిన సమాచారం లేదు. 2015 నుంచి 2018 మధ్య  ప్రభుత్వ ఉత్తర్వులు ప్రతి జలాశయం నుంచి పరిశ్రమలకు ఇచ్చే నీటికి  నిర్దేశించిన  రేట్ల ప్రకారం  నగదు చెల్లిస్తాయని చెబుతున్నాయి.  సింగూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి, 2015 రేట్లతో, మాకు తెలిసిన కేటాయింపుల ఆధారంగా ఈ రకమైన ఆదాయం  ఏడాదికి సుమారు రూ. 12 కోట్ల వరకు గరిష్ఠ  అంచనా.  ఎంత బిల్లు చేశారో,   ఎంత  వసూలైందో,  అందులో  ఏదైనా ఆనకట్ట యజమాని అయిన నీటిపారుదల శాఖకు  చేరుతోందో  లేదో వంటి సమాచారం అందుబాటులో లేదు.  

ఏ నియమమూ,  అందుబాటులో ఉత్తర్వూ లేకుండానే నీటి కోతలను ప్రకటిస్తున్నారు. 16 టీఎంసీల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆనవాయితీగా సాగునీటికే  ముందు కోత పెట్టారు. ఇది 2017 స్థాయికి సరిపోలినట్టు కనిపిస్తోంది.  పరిశ్రమలు, సంస్థలు ఇప్పుడు 20 నుంచి 50 శాతం కోతలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు  తెలియజేస్తున్నాయి.  సింగూరు చుట్టూ ఉన్న పట్టణాలు, గ్రామాలకు మాత్రం బోరుబావులు, ఇతర ప్రత్యామ్నాయ వనరులే ప్రణాళిక.  తాగునీటి  సరఫరాలో హైదరాబాద్ నగరానికే ప్రాధాన్యత అని స్పష్టం అవుతున్నది. సంబంధిత ఉత్తర్వులు  ప్రజలకు అందుబాటులో  లేవు. 

నీటికోసం ఘర్షణలు ఏర్పడే అవకాశం

మున్ముందు నీటికోసం యుద్ధాలు అని మనం వల్లె వేసే  పరిస్థితి  రాబోతున్నదా?  ప్రభుత్వం ప్రకటించిన విధానం సమర్థనీయంగా లేనప్పుడు, ముందస్తు నియమావళి లేనప్పుడు.. రైతులు నగరాలకి వ్యతిరేకంగా, ఒక జిల్లాకు ఇంకొక జిల్లాకు,  గ్రామాలు పట్టణాలకు వ్యతిరేకంగా, పరిశ్రమల మధ్య కూడా ఘర్షణాత్మక వాతావరణం తలెత్తే అవకాశం ఉంది.  ఇది తీవ్రమైతే ప్రతిరంగంలో ఈ ఘర్షణ మరింత జటిలంగా మారుతుంది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా  కామారెడ్డి,  ఒక రైతుకు వ్యతిరేకంగా మరో రైతు,  ఒక పరిశ్రమకు  వ్యతిరేకంగా మరో పరిశ్రమ మధ్య విభేదాలు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.  

నియమావళి (ప్రొటోకాల్) లేకపోతే  ప్రతి రంగం సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అది పాలనాపరంగా సమర్థనీయం కాదు.  సింగూరు ఒక్కటే కాదు. తెలంగాణలోని  ఇతర  జలాశయాలు కూడా ఒకటికంటే ఎక్కువ  ప్రధాన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.  సింగూరును  ప్రొటోకాల్ లేకుండా వదిలేసిన చట్రం వాటికీ సమానంగా వర్తిస్తుంది. 2023 మాన్యువల్ అది అనుసరించే కేంద్ర జలసంఘం నమూనాలాగే, డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సురక్షితంగా ఎలా నడపాలో ఇంజినీర్లకు చెబుతుంది. కానీ కొరత ఉన్న నీటిని ఎలా పంచాలో  చెప్పదు. 

ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏమేమి ఉంటాయి

ముందుగా కొలత.  జలాశయం నుంచి తీసుకునే ప్రతి వినియోగానికి, డ్యామ్ సమీపంలో తోడే  భూగర్భ జలాలతో సహా,  మీటరుతో  కొలిచి రోజూ నివేదించే రిజిస్టర్ ఉండాలి.  అప్పుడే  కేటాయింపు ఊహలపై కాక వాడకంపై ఆధారపడుతుంది. రెండోది  పర్యవేక్షణ.  రోజువారీ బహిరంగ డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్  నిల్వను, ఉపయోగకర నిల్వను,  ప్రస్తుత వినియోగంతో ఎన్ని రోజుల సరఫరా మిగిలిఉందో,  తాగునీటి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేక్ వద్ద నాణ్యత రీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చూపాలి.  ఆ తర్వాత సూత్రాలు. తాగునీటికి మొదటి ప్రాధాన్యం. నగరానికీ,  గ్రామానికీ మధ్య పంపిణీకి ఒక స్పష్టమైన నియమం ఉండాలి, తలసరి అందే నీటిని లీటర్లలో కొలవాలి. 

అనవసర, పారిశ్రామిక వినియోగాన్ని ముందుగానే నిష్పత్తి ప్రకారం  తగ్గించాలి.  రైతులకు  రక్షణ, మద్దతు అందించాలి.  నిల్వ కోలుకున్నప్పుడు తిరిగి పునరుద్ధరించాలి. ప్రతి జలాశయానికి కేటాయింపులను కొలిచిన వినియోగంతో పోల్చాలి.  దానికితోడు ఆదాయ, వ్యయాల ఖాతా ఉండాలి.   నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది తదితర వివరాలు నమోదు చేయాలి. ఇది మిగతా వ్యవస్థతో అనుసంధానం కావాలి. వ్యవసాయ విద్యుత్ షెడ్యూళ్లు, విత్తనాలకు ముందే పంట సలహాలు, భూగర్భజల నియమాలు, పొదుపు లక్ష్యాలు ప్రకటించాలి.  గ్రేటర్ హైదరాబాద్ అంతటా 20 శాతం నీటిని ఆదా చేస్తే రోజుకు సుమారు 80 ఎంజీడీ ఆదా అవుతుందని ప్రధాన కార్యదర్శి చెప్పారు. ప్రాంతాలవారీ లక్ష్యాలను మీటర్లతో సరిచూస్తే, ఇలాంటి ప్రకటన ప్రణాళికగా మారుతుంది. 

ఆందోళన పడకుండా సిద్ధమవుదాం

డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు నిర్వహణ నియమాలు ఉండాలని దాని సొంత మాన్యువలే చెబుతోంది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల సింగూర్ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు.  రాతపూర్వక, సంప్రదింపులతో రూపొందించే నియమావళికి  ఇప్పుడే  సిద్ధమవ్వాలి. లేదంటే తరువాత ఘర్షణ తప్పదు.  నీటి నియమావళి రూపొందించేముందు విస్తృతస్థాయిలో సంప్రదింపులు చాలా అవసరం. భయాందోళన ఎవరికీ ఉపయోగపడదు.  ట్యాంకర్ల వినియోగం, హడావుడి బోరుబావుల తవ్వకం, నష్టానికి అమ్మకాలు, నిరసనలు వంటి ఆందోళనలు డబ్బును, నమ్మకాన్ని రెండింటినీ ఖర్చు చేస్తుంది. 

ఉత్తమ సన్నద్ధతకు నిదర్శనం ఒక విస్తృత సూత్రాల ఆధారంగా రూపొందించిన నియమావళి.  ప్రతి ప్రధాన నిల్వకూ నీటి ప్రొటోకాల్ ఉండాలి.  ఒకటి కంటే ఎక్కువ ప్రధాన అవసరాలకు ఉపయోగపడే జలాశయాలతో ప్రారంభించాలి. ప్రస్తుత స్థితిని, ఇప్పుడు అమలులో ఉన్న కోతల క్రమాన్ని ప్రచురించాలి. తొందరగా  ముసాయిదా విడుదల చేసి, వేసవికి ముందే ఆమోదించాలి.  ప్రతి నిల్వస్థాయిలో ఎవరికి ఎంత, ఏ క్రమంలో, ఎంత ముందస్తు సమాచారం ఉండాలి. ఎలా నీరు అందుతుందో  చెప్పేలా ముందుగా  రాతపూర్వక నియమాలు తయారుచేసి ప్రజలకు తెలిపేలా ప్రచురించడం  ప్రజా పాలనకు నిదర్శనం.  

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​
ఓపెన్​ పేజీకి  వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.