బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత.. గిరిజన మహిళా సర్పంచ్‌పై లాఠీచార్జ్‌ చేశారని నిరసన

బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత.. గిరిజన మహిళా సర్పంచ్‌పై లాఠీచార్జ్‌ చేశారని  నిరసన

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం తాళ్లపేటలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలతో జరిగిన వాగ్వాదం వివాదానికి దారితీయగా, గిరిజన మహిళా సర్పంచ్‌ కళావతి, ఉప సర్పంచ్‌ తిరుపతిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ వేడుకల్లో మొదలైన వివాదం

స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అనుచరుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా పేర్కొంటున్న ఆకుల దుర్గాప్రసాద్‌ బతుకమ్మ ఆడుతున్న మహిళలపై టపాసులు వేయడంతో వివాదం మొదలైంది. దీంతో మహిళలు ఆయనను నిలదీయగా, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గిరిజన మహిళా సర్పంచ్‌ కళావతిపై దుర్గాప్రసాద్‌ దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు.

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌పై లాఠీచార్జ్‌ చేశారని ఆరోపణ

వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు తాళ్లపేట గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఇరువర్గాలకు సర్దిచెప్పాల్సిన పోలీసులు గిరిజన సర్పంచ్‌ కళావతి, ఉప సర్పంచ్‌ తిరుపతిపై లాఠీచార్జ్‌ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ రమణమూర్తి అకారణంగా దాడి చేశారని పేర్కొంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అర్ధరాత్రి రోడ్డుపై నిరసన

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌పై దాడి చేశారని ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆకుల దుర్గాప్రసాద్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు, సీఐ రమణమూర్తిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి రోడ్డుపై నిరసన చేపట్టారు. గిరిజన మహిళా సర్పంచ్‌కు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసుల అధికారిక వివరణ, తదుపరి చర్యల వివరాలు తెలియాల్సి ఉంది.