శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బందిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ నేతృత్వంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేత చర్యల కోసం జేసీబీ తదితర యంత్రాలతో మధురానగర్కు చేరుకున్నారు. అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు.
ఈ క్రమంలో అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కూల్చివేత చర్యలను స్థానికులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కూల్చివేత ప్రక్రియను చేపట్టకుండానే మున్సిపల్ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
మధురానగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.
