- తొలిసారిగా అమలు చేయనున్న ఎస్సెస్సీ బోర్డు
- సెంటర్ తెలిసేలా హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్
- ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 దాకా ఎగ్జామ్స్
- హాజరుకానున్న 5.28 లక్షల మంది విద్యార్థులు
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం స్కూళ్ల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా నేరుగా మొబైల్లోనే తీసుకునేలా ఎస్సెస్సీ బోర్డు వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వాట్సప్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రతిరోజూ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,674 స్కూళ్ల నుంచి 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. బాయ్స్ 2,67,954 మంది ఉండగా, గర్ల్స్2,60,285 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది, గతంలో ఫెయిలైన వారు 10,512 మంది ఉన్నారు. వీరి కోసం 2,676 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 040 -23230942కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
తప్పులుంటే సరిదిద్దుకోండి..
బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in ద్వారా గురువారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. హాల్‌టికెట్లలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం వంటి వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవడానికి ఈ నెల 12 నుంచి 26వ తేదీ వరకు అధికారులు గడువు ఇచ్చారు. స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా హెడ్ మాస్టర్లు ఆన్‌లైన్‌లో ఈ సవరణలు చేయాల్సి ఉంటుంది.
వాట్సప్ ద్వారా హాల్ టికెట్ పొందడం ఇలా..
8096958096 నంబర్‌కు వాట్సాప్ ద్వారా “Hi” అని మెసేజ్ పంపాలి
ఆ తర్వాత “SSC Hall Ticket March 2026” అని పంపాలి
అడిగిన విధంగా విద్యార్థికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి
ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి వస్తుంది.
ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే జిల్లాలకు క్వశ్చన్ పేపర్లు పంపించాం. అన్ని స్కూళ్లకు హాల్ టికెట్లనూ పంపించాం. స్టూడెంట్లు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లను వెబ్ సైట్తోపాటు వాట్సప్ ద్వారా తీసుకునేలా ఏర్పాట్లు చేశాం. సెంటర్ల వివరాలు తెలుసు కునేందుకు వాటిపై క్యూఆర్ కోడ్ ప్రింట్ చేశాం.
- పీవీ శ్రీహరి, డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం
