ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఏఐ ఎంత డామినేట్ చేసినా.. మాన్యువల్‌గా మనిషి కంట్రోల్ లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పేందుకు సరైన ఉదాహరణ ఇది. డ్రైవర్ లెస్ కార్లు,సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అంటూ వాహనాల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తూ.. డ్రైవర్ తో పనిలేదనే ప్రచారం చేస్తున్న వేళ.. కంపెనీలకు సవాల్ విసిరే ఘటన ఇది.
సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసి కారే చూసుకుంటుందిలే అనే ధీమాతో కునుకు తీసిన ఒక డ్రైవర్.. క్షణకాలంలో జరిగిన ఊహించని పరిణామం షాకింగ్ కు గురిచేసింది. డ్రైవర్ నిద్రలో ఉండగా.. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో పరుగు తీస్తున్న టెస్లా కారు నేరుగా వెళ్లి ఆగిఉన్న పోలీసు వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో భయాందోళనకు గురిచేస్తోంది.
కాలిఫోర్నియాలో ఫెయిర్లెండ్ ఇంటర్ స్టేట్ 80 దగ్గర 2026 అక్టోబర్ 13 రాత్రి ఈ జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చింది. టెస్లా కార్ లో వెళ్తున్న డ్రైవర్ నిద్రలో ఉండగా.. హైవే పెట్రోలింగ్ ఆఫీసర్స్ వెహికిల్ ను ఢీకొట్టింది.
కాలిఫోర్నియా హైవే పెట్రోల్ (CHP) ప్రకారం, వార్నింగ్ ఫ్లేర్స్, ట్రాఫిక్ కోన్లు, మెరుస్తున్న ఎమర్జెన్సీ లైట్లతో ఘటనా స్థలాన్ని అనేక లేన్లను మూసివేశారు. అయినప్పటికీ, టెస్లా వాహనం నిషేధిత విభాగంలోకి దూసుకెళ్లి, పెట్రోల్ కారును వెనుక నుండి ఢీకొట్టింది.
CHP విడుదల చేసిన డాష్‌క్యామ్ ఫుటేజ్‌లో, టెస్లా కారు వేగంగా దూసుకువచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టినట్లు కనిపిస్తుంది. కారులో ఉన్న ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
కారును నడిపింది శాక్రమెంటోకు చెందిన 22 ఏళ్ల యువకుడు. యాక్సిడెంట్ తర్వాత చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు సమాచారం. వాహనంలోని ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్‌ను ఆన్ చేసి తాను నిద్రపోతున్నానని దర్యాప్తు అధికారులు తెలిపాడు.
Two Solano CHP officers were seriously injured when a Tesla struck their patrol vehicle on I-80 eastbound, despite flares, cones, and flashing emergency lights. The driver claimed he was asleep while using driver-assistance technology. Drivers must remain alert and in control. https://t.co/VlavzeWRzk
— CHP Headquarters (@CHP_HQ) October 16, 2026
డ్రైవింగ్ టెక్నాలజీకి ఛాలెంజ్:
ఈ ఘటన, డ్రైవింగ్ టెక్నాలజీ భద్రతపైనా, ఆటోమేటెడ్ సిస్టమ్‌లపై డ్రైవర్లు అతిగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలపైనా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
టెస్లాతో పాటు వివిధ కంపెనీలు అందిస్తున్న ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ పై పలు ప్రశ్నలు మొదలయ్యాయ. అయితే పేరుకు విరుద్ధంగా, టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సిస్టమ్ అనేది వాహనాలను పూర్తిగా డ్రైవర్ లేకుండా కంట్రోల్ చేయవు అని చెబుతున్నారు. ఇది ఒక డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ అని అంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఉన్నప్పటికీ.. దీనిలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. దారిని చూసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో వెహికిల్ ను కంట్రోల్ లోకి తీసుకునేందుకు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
అలాంటప్పుడు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. ఇది వాహనదారులను తప్పదోవ పట్టించడమేనని అంటున్నారు.
అయితే ఎగిరే కార్ల నుంచి డ్రైవర్ లెస్ టెక్నాలజీ వరకు.. వాహనాల ఫ్యూచర్ నే మార్చేస్తామని చెప్పుకుంటున్న టెస్లా కారు విషయంలోనే ఇలాంటి ఘటన జరగటం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
