తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు మంగళవారం ( 11, ఆగస్టు 2026 ) ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటుడు తాగుబోతు రమేష్, చిత్రం భాషతో పాటు పలువురు డాన్సర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సోమరాజు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతలు చెల్లించే పారితోషికం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా నేరుగా డాన్సర్లకు చేరాలన్న సుమలత పోరాటం తనను ఆకట్టుకుందని చెప్పారు. తన నిర్మాణంలో రాబోయే సినిమాల్లో హైదరాబాద్‌కు చెందిన స్థానిక డాన్సర్లకు 100 శాతం అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
సుమలత మాట్లాడుతూ.. యూనియన్ బైలాస్ ప్రకారమే ఉప ఎన్నికలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఎవరినీ ఎదిరించేందుకు, పెద్దలను నొప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోలేదని.. డాన్సర్స్ యూనియన్ అభివృద్ధి ఆగిపోయిన పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు షూటింగ్స్ లేని సమయంలో యూనియన్‌కు అందుబాటులో ఉంటూ డాన్సర్ల సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. యూనియన్‌లో జరిగిన పరిణామాలను ఒక కుటుంబంలో జరిగిన చిన్న విషయంగా అభివర్ణించారు. పెద్దల నిర్ణయాన్ని గౌరవించి మెజారిటీ అభిప్రాయం మేరకే ఉప ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. ఫెడరేషన్ తమకు తండ్రి లాంటిదని, తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో తమను నడిపించాలని కోరారు. నిర్మాత ఇచ్చే ప్రతి రూపాయి కష్టపడే డాన్సర్‌కే చేరాలని, మధ్యలో నిధులు ఆగిపోకూడదని స్పష్టం చేశారు. స్థానిక తెలుగు డాన్సర్లకు తన పాటల్లో ప్రాధాన్యం ఇస్తానని కూడా వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవికి, ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ.. రామ్ చరణ్ ఇచ్చిన రూ.40 లక్షలు, జానీ మాస్టర్ అందించిన రూ.18 లక్షలను త్వరలో సభ్యుల బీమా కోసం వినియోగిస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం రాకతో డాన్సర్స్ యూనియన్‌లో మరింత పారదర్శకత, సంక్షేమం, స్థానిక ప్రతిభకు ప్రాధాన్యం దక్కుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
#dancersassociation పై పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్
— SZN (@Suzenbabu) August 11, 2026
మేము ఇచ్చే డబ్బులు డైరెక్ట్ గా పర్సన్ కి వెళ్ళాలి మీడియేటర్ కు వెళ్లకూడదు
వుమెన్ లీడర్ గా మీరు యూనియన్ గురించి ఫైట్ చేశారు
మన డాన్సర్స్ యూనియన్ లో ఉన్న సభ్యులు ఏ ఇండస్ట్రీ లో లేరు
మా సినిమా పాటలకు ఏరోజు పెమెంట్స్ ఆరోజు… pic.twitter.com/n1evFCui8Y
