దళపతి భార్యకు అదిరిపోయే రిటర్న్స్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారానే నెలకు అరకోటి ఆదాయం!

దళపతి భార్యకు అదిరిపోయే రిటర్న్స్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారానే నెలకు అరకోటి ఆదాయం!

తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న నటుడు విజయ్. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన.. తన ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన ఆర్థిక వివరాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, భార్య సంగీతతో విడాకుల వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ఆర్థిక వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భార్య పేరిట కోట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు

గత కొంతకాలంగా విజయ్, సంగీత విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, అఫిడవిట్‌లోని వివరాలు చూస్తుంటే విజయ్ తన భార్య భవిష్యత్తు కోసం పక్కాగా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. సంగీత పేరిట వివిధ బ్యాంకుల్లో భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. ఇండియన్ బ్యాంక్ లో రూ. 25 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ. 40 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.20 కోట్లు డిపాజిట్ చేశారు .

ఈ మొత్తంగా రూ. 85 కోట్లకు పైగా డిపాజిట్లు ఆమె ఖాతాలో ఉండటంతో, వాటి ద్వారా వచ్చే వడ్డీతోనే ఆమెకు నెలకు దాదాపు రూ. 49 లక్షలు ఆదాయం సమకూరుతోంది. అంతేకాకుండా ఆమె వద్ద 391 తులాల బంగారు ఆభరణాలు, వెండి ,వజ్రాలు ఉన్నాయి. ఆమె మొత్తం ఆస్తి విలువ రూ. 15 కోట్లు దాటుతుందని సమాచారం.

కుటుంబమే ప్రాణం..

విజయ్ తన సంపాదనలో మెజారిటీ భాగాన్ని కుటుంబ సభ్యులకే రుణాల రూపంలో ఇచ్చారు. వారిలో తన తన భార్య సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు, తల్లి శోభకు రూ. 87.12 లక్షలు ఇచ్చారు.,  తన వారసులు సంజయ్ జేసన్ రూ. 8.78 లక్షలు, దివ్య సాషా రూ. 4.6 లక్షలు ఆర్థిక సాయం చేశారు. తన పార్టీలో కీలక వ్యక్తి అయిన ఎన్. ఆనంద్‌కు రూ. 3 కోట్లు రుణంగా ఇచ్చి తన రాజకీయ ప్రయాణానికి పునాదులు వేశారు.

అప్పుల్లేని ఆస్తిపరుడు

విజయ్ మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ. 404.58 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ. 11.51 కోట్లుగా ఉన్నాయి. ఆయన వద్ద ఐదు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.  ఇంత ఆస్తి ఉన్నప్పటికీ విజయ్ పేరిట ఎటువంటి బ్యాంక్ అప్పులు లేవు. విజయ్ సమర్పించిన ఈ అఫిడవిట్ ఆయన పట్ల అభిమానుల్లో ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంలో దళపతి తన బాధ్యతను నెరవేర్చారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.