ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​లో పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​

ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​లో పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​

డిఫెన్స్​లో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం యువతను చేర్చుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌‌‌‌మెంట్ చేసుకుంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు బాధ్యతలు అప్పగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్ అయినవారినే అగ్నివీర్స్ అంటారు. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​లో పోస్టులకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. 

అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​లో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల సర్వీస్​ పూర్తైన తర్వాత 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌‌‌‌లో చేర్చుకుంటారు. రెగ్యులర్ కేడర్‌‌‌‌లో చేరినవారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌‌‌‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక మిగతా 75 శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ, స్కిల్ సర్టిఫికెట్స్ లభిస్తాయి. వారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌‌‌‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి.

అగ్నిపథ్​ రూల్స్​

అగ్నిపథ్‌‌‌‌ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్‌‌‌‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టంచేసింది.

ప్రతి బ్యాచ్‌‌‌‌లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్‌‌‌‌ కేడర్‌‌‌‌లోకి తీసుకుంటుంది. ఇలా సాధారణ కేడర్‌‌‌‌లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్‌‌‌‌ స్కీం, క్యాంటీన్‌‌‌‌ స్టోర్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (సీఎస్‌‌‌‌డీ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.

విద్యార్హతలు

జనరల్‌‌‌‌ డ్యూటీ (సాధారణ విధుల) కోసం దరఖాస్తు చేసుకొనే అగ్నివీరుల వయసు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌‌‌‌లో కనీసం 33% మార్కులు రావాలి.  ఏదైనా బోర్డు మార్కులు కాకుండా గ్రేడింగ్‌‌‌‌ విధానం పాటిస్తున్నట్లయితే అన్ని సబ్జెక్టుల్లో కనీసం ‘డి’ గ్రేడ్‌‌‌‌ (33% నుంచి 40%) సాధించాలి. మొత్తంమీద ‘సి2’ గ్రేడ్‌‌‌‌ (45%కి సమానం)తో పాసై ఉండాలి. టెక్నికల్‌‌‌‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌‌‌‌ ఫిజిక్స్‌‌‌‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌ సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌‌‌‌లో తప్పనిసరిగా 40% మార్కులు వచ్చి ఉండాలి.

క్లర్క్‌‌‌‌/ స్టోర్‌‌‌‌కీపర్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌ (అన్ని విభాగాలు): 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌‌‌‌లో ఏదో ఒక గ్రూప్‌‌‌‌ (ఆర్ట్స్‌‌‌‌, కామర్స్‌‌‌‌, సైన్స్‌‌‌‌) 60% మార్కులతో, ఒక్కో సబ్జెక్ట్‌‌‌‌లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్‌‌‌‌, మ్యాథ్స్‌‌‌‌/ అకౌంట్స్‌‌‌‌/ ఖాతా పుస్తకాల నిర్వహణ (బుక్‌‌‌‌ కీపింగ్‌‌‌‌)లో 50% మార్కులు తప్పనిసరి.
అగ్నివీర్‌‌‌‌ ట్రేడ్స్‌‌‌‌మెన్‌‌‌‌ 10 పాస్‌‌‌‌ (అన్ని విభాగాలు): 10వ తరగతి పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌‌‌‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి. అగ్నివీర్‌‌‌‌ ట్రేడ్స్‌‌‌‌మెన్‌‌‌‌ 8 పాస్‌‌‌‌ (ఆల్‌‌‌‌ ఆర్మ్స్‌‌‌‌): 8వ తరగతి సాధారణంగా పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌‌‌‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి.

రిలాక్సేషన్ 

మాజీ సైనికోద్యోగుల పిల్లలు, యుద్ధ వితంతువుల సంతానానికి కొన్ని విభాగాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలో బోనస్‌‌‌‌ మార్కులు లభిస్తాయి. ఎన్‌‌‌‌సీసీ ఎ, బి, సి సర్టిఫికెట్లు ఉన్నవారికి కొన్ని మార్కులు కలుస్తాయి. సైనిక, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో 2 కిలోలు, ఛాతీ కొలతలపరంగా సెంటీమీటరు మేర సడలింపు ఉంటుంది. యుద్ధ వితంతువులు దత్తత తీసుకున్న కుమారులకూ పైన పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి. 

ఐఏఎఫ్‌‌‌‌ -అగ్నివీర్‌‌‌‌ వాయు ఉద్యోగాలు

ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఐఏఎఫ్‌‌‌‌) అగ్నిపథ్‌‌‌‌ స్కీం ద్వారా  అగ్నివీర్‌‌‌‌ వాయు ఇన్‌‌‌‌టేక్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది.  అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌ సబ్జెక్టులతో ఇంటర్​/ డిప్లొమా ఉత్తీర్ణత. 23 ఏళ్లు మించకూడదు. మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది రూ.33000, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది నెలకు రూ.40000 + అలవెన్సులు అందజేస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (ఫేజ్‌‌‌‌-1, ఫేజ్‌‌‌‌-2), ఫిజికల్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, మెడికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​లో జులై 5 వరకు అప్లై చేసుకోవచ్చు.  జులై  24 నుంచి ఎగ్జామ్​ ప్రాసెస్​ మొదలవుతుంది. సమాచారం కోసం  www.careerindianairforce.cdac.in వెబ్​సైట్​ చూసుకోవాలి.  

టెక్నికల్‌‌‌‌, ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌

ఇండియన్‌‌‌‌ ఆర్మీ అగ్నివీర్‌‌‌‌ ర్యాలీ నోటిఫికేషన్‌‌‌‌  ద్వారా టెక్నికల్‌‌‌‌, నాన్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌, ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు తేదీలు త్వరలో వెల్లడించనుంది.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30000 + అలవెన్సులు, రెండో ఏడాది నెలకు రూ.33000 + అలవెన్సులు, మూడో ఏడాది నెలకు రూ.36500 + వర్తించే అలవెన్సులు, నాలుగో ఏడాది నెలకు రూ.40000 + వర్తించే అలవెన్సులు అందజేస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ మెజర్‌‌‌‌మెంట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, మెడికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు  www.joinindianarmy.nic.in వెబ్​సైట్ సంప్రదించాలి.