
తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ లియో(Leo). భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో నటించిన సినిమాను చూస్తూ పండగా చేసుకుంటున్నారు.
అయితే అందరి ఫ్యాన్స్ లా కాకుండా.. ఒక వ్యక్తి కొత్తగా ఆలోచించాడు. ఫెవరెట్ హీరో సినిమా మొదటిరోజు ఎవరైనా చూస్తారు.. అందుకే ఈ వ్యక్తి లియో సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో అందరిముందు తన కాబోయే భార్యతో కలిసి దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడు పుదుకుట్టై జిల్లాకు చెందిన వెంకటేష్, మంజులకు హీరో విజయ్ అంటే చాలా ఇష్టం. ఈ జంట ఎంగేజ్మెంట్ ఈ ఏడాది ఆరంభంలోనే జరిగింది. అయితే ఇద్దరు విజయ్ ఫ్యాన్స్ కాబట్టి పెళ్లి లియో విడుదల తర్వాతే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే గత ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20న పెళ్లి ముహూర్తం ఉండగా.. ఇవాళ(అక్టోబర్ 19) లియో విడుదల రోజు థియేటర్ లో దండలు మార్చుకున్నారు. కాబోయే వధూవరులు ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో థియేటర్ కి వచ్చి, బంధువులు, స్నేహితులు, ప్రేక్షకుల మధ్య దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులతో కలిసి సినిమా వీక్షించారు. ఇదంతా ఆ జంట బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.