గంజాయి దందాకు అడ్డా

గంజాయి దందాకు అడ్డా

రాష్ట్రాన్ని స్మగ్లింగ్​ సెంటర్​గా మారుస్తున్న ముఠాలు
ఉత్తరాంధ్ర, ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి
ఇక్కడి నుంచి ట్రైన్​రూట్‌లో దేశం నలుమూలలకు
స్టూడెంట్లే టార్గెట్‌గా అమ్మకాలు

గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రం అడ్డాగా మారుతోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఏజెన్సీ నుంచి గంజాయి వివిధ మార్గాల్లో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలకు చేరుతోంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్​, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర పట్టణాల నుంచి అక్కడినుంచి దేశం మొత్తం తరలుతోంది. రాష్ట్రంలో వేలాది మంది గంజాయి స్మగ్లింగ్‌ను వృత్తిగా మార్చుకున్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.

వెలుగు, నెట్వర్క్:తెలంగాణ కేంద్రంగా గంజాయి నెట్​వర్క్​ దేశమంతా విస్తరిస్తోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా, చత్తీస్​గఢ్​ ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుగా సాగవుతున్న గంజాయి వైజాగ్​నుంచి వివిధ మార్గాల్లో తెలంగాణలోని నగరాలు, పట్టణాలకు చేరుతోంది. రాష్ట్రంలో వేలాది మంది గంజాయి స్మగ్లింగ్​ను వృత్తిగా మార్చుకున్నట్లు పోలీస్​ గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్లే అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు తరచూ పట్టుబడుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్మగ్లర్ల నెట్ వర్క్​నడుస్తోంది. స్మగ్లర్లు ఏజెన్సీ ప్రాంతాల్లోని  గిరిజనులతో గుట్టుగా గంజాయి సాగు చేయించి, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్​, రామగుండం, మంచిర్యాల, కాగజ్​నగర్​ లాంటి పట్టణాలకు తెచ్చి, అక్కడినుంచి ఉత్తరాదికి, రాష్ట్రంలోని వివిధ నగరాలకు రైళ్లలో సరఫరా చేస్తున్నారు. ఈ మార్గంలో కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 50 మందికి పైగా కేసు నమోదు చేశారు.

రాష్ట్రంలోనూ సాగు..

నాగర్​కర్నూల్​ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు, తండాల్లో ముఖ్యంగా  అచ్చంపేట, అమ్రాబాద్​, పదర మండలాల్లో, కొల్లాపూర్​ మండలంలోని మొలచింతల, నార్లాపూర్​ ప్రాంతాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ఖానాపూర్‍, పెంబి, సారంగాపూర్, మాండ, కడెం మండలాల్లో,  ఆసిఫాబాద్​జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తి, కందిలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారు. వాహనాల్లో స్టీరింగ్ కింద, స్టెఫినీ టైర్లలో, బైక్ సీట్లను కట్ చేసి అందులో కూరి ట్రాన్స్ పోర్ట్​ చేస్తున్నారు. బస్సులు, రైళ్లలో కేజీల కొద్దీ గంజాయి మూటలు వేసి మామూలు ప్రయాణికుల్లా గమ్యం చేరుస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కొబ్బరి బొండాలను తరలిస్తున్న మినీ వ్యాన్ బోల్తా పడగా, అందులో తరలిస్తున్న 100 కిలోల గంజాయి బయటపడింది. గత నెలలో రఘునాథపాలెం మండలంలో మారుతీ ఎర్టిగా కారు చెట్టుకు ఢీకొనగా, అందులో తరలిస్తున్న 500 కిలోల గంజాయి బయటపడింది.  గంజాయి వాసనను  పసిగట్టకుండా ఉండేందుకు చిన్న సైజు ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి వాటిపై సెంట్​ స్ప్రే చేస్తున్న ఘటనలూ విచారణలో వెలుగుచూశాయి. పోలీసుల కళ్లు గప్పేందుకు గంజాయిని లిక్విడ్​గానూ మారుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా  పటాన్ చెరు మండలం అమీన్ పూర్​లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ముగ్గురు నైజీరియన్ల నుంచి లిక్విడ్​ రూపంలో ఉన్న గంజాయి కొనుగోలు చేస్తూ ఓ హోటల్​లో పట్టుబడ్డారు.

బానిసల్లో అత్యధికులు స్టూడెంట్సే..

గంజాయికి బానిసలవుతున్న వారిలో అత్యధికులు యువకులు, ముఖ్యంగా స్టూడెంట్సే ఉంటున్నారు. అందులోనూ ఇంజినీరింగ్​స్టూడెంట్లు ఎక్కువగా పట్టుబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో గంజాయి తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే ఏకంగా 200 మంది యువకులు గంజాయికి బానిసైనట్లు తెలిసి ఖాకీలు నివ్వెరపోయారు. స్టూడెంట్స్​తో పాటు పిల్లలు గంజాయికి అడిక్ట్ కావడం, వింతగా ప్రవర్తిస్తుండడంతో తల్లిదండ్రులు తమను ఆశ్రయిస్తున్నారని కరీంనగర్​కు చెందిన ఓ ప్రముఖ సైకియాట్రిస్టు చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏకంగా  300 మంది స్టూడెంట్లు నిత్యం గంజాయి తాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  వీరిలో సెవన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కూడా ఉండడం కలవరపెడుతోంది. గంజాయికి బానిసై ఇటీవల చిక్కిన ఓ ఇంజనీరింగ్​స్టూడెంట్​అనంతరం విక్రేతగా మారినట్లు పోలీసులు గుర్తించారు.  ఇక హైదరాబాద్​నగరంలో వ్యాపారులు.. స్టూడెంట్స్​, ఉపాధి, ఉద్యోగ అన్వేషణలో ఉన్న యూత్​ను టార్గెట్​ చేస్తున్నారు.  ముందు బానిసలుగా మార్చి, వారితోనే విక్రయాలు చేయిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ఒక్క హైదరాబాద్​ నగరంలోనే 150 కేసులు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్​పోలీసులు 258 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఏకంగా 547 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గుడుంబా నిషేధంతో గంజాయి వైపు..

ప్రభుత్వం గుడుంబా తయారీపై నిషేధం విధించడంతో  మారుమూల తండాలు, పల్లెల్లోని కొన్ని వర్గాలు గంజాయి అమ్మకాలను వృత్తిగా మలుచుకుంటున్నాయని పోలీసులు అంచనాకు వచ్చారు.  ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా పెన్​పహాడ్​ మండలంలోని జల్మల్​ కుంట తండా, దూపాడు ప్రాంతాలకు చెందిన నలుగురు ముఠా సభ్యులు కారులో 18 కేజీల గంజాయి తరలిస్తూ మిర్యాలగూడ టూటౌన్​ పోలీసులకు చిక్కారు. వీరంతా గతంలో గుడుంబా తయారీపై జీవనం సాగించినవారే కావడం గమనార్హం.

కోట్లకు పడగెత్తుతున్న దళారులు

ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులతో గంజాయి సాగు చేయిస్తున్న ముఠాలు, కిలోకు వెయ్యి చొప్పున సేకరించి, బహిరంగ మార్కెట్లో కేజీ రూ. 5 వేల నుంచి 6 వేలకుపైగా విక్రయిస్తున్నాయి. దళారులు వాటిని 10, 15 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రూ.300 నుంచి రూ.500 చొప్పున  అమ్ముతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రైతులకు మిగిలేది అంతంత మాత్రమేకాగా దళారులు మాత్రం కోట్లకు పడగెత్తుతున్నారు. పలు ఏజెన్సీ జిల్లాల్లో  గంజాయి సాగు, రవాణాలో కొందరు లీడర్లు తెర వెనుక పాత్ర పోషిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. అందువల్ల ఆయా చోట్ల ఎక్సైజ్​, పోలీస్​ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపిన సర్కారు,  గంజాయికి సైతం అడ్డుకట్ట వేయాలనీ, లేదంటే రేపటితరం భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం