విగ్రహం పడిపోతుంది.. తప్పించుకోండి: కోల్ కతా తొక్కిసలాటకు ఈ ప్రకటనే కారణం

విగ్రహం పడిపోతుంది.. తప్పించుకోండి: కోల్ కతా తొక్కిసలాటకు ఈ ప్రకటనే కారణం

కోల్‌కతా  చోర్బాగన్ దుర్గా పూజ పండల్ దగ్గర జరిగిన విషాద ఘటనలో షాకింగ్  విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2026 అక్టోబర్ 17( శనివారం ) సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించగా, 25 మంది గాయపడ్డ ఘటనకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండల్ (విగ్రహం) పడిపోతుంది.. తప్పించుకోండి.. అంటూ మైక్ నుంచి వెలువడిన ప్రకటనతో ఒక్కసారిగా అల్లకల్లోలం జరిగింది. 

“పండల్ పరిస్థితి బాలేదు..  కూలిపోతుంది. దయచేసి వెళ్లిపోండి అని చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను కోల్‌కతా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు ఆ ప్రకటన చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం సువేందు అధికారి ఈ ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పూజా కమిటీ చేసిన ఈ ప్రకటనే గుంపు తొక్కిసలాటకు దారితీసి ఉండవచ్చని అన్నారు. 

ప్రాథమిక విచారణలో నిర్వహణలో లోపాలు, గందరగోళ ప్రకటనలు, సప్తమి సందర్భంగా వర్షం కారణంగా ఆశ్రయం కోసం అకస్మాత్తుగా పెరిగిన జనసందోహం కలిసి ఈ ఘటనకు దారితీశాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.  నిర్వాహకుల తీవ్రమైన నిర్వహణ లోపాలకు సాక్ష్యాలు సేకరించాం. పెద్ద సంఖ్యలో సందర్శకులను నిర్వహించే స్పష్టమైన ప్రణాళిక లేదు అని అన్నారు.

పండల్ గేట్లు, అక్కడికి వెళ్లే దారులు ఇరుకుగా ఉన్నాయి. ప్రకటనతో భయాందోళనల మధ్య  సందర్శకులు ప్రవేశ ద్వారం గుండానే బయటకు రావాలని ప్రయత్నించడం తొక్కిసలాటకు దారితీసింది. ఎంట్రీ, ఎగ్జిట్  గురించి సరైన ప్రకటనలు, బోర్డులు లేకపోవడం వల్ల ప్రజలు మరింత గందరగోళానికి గురయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరించి, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సరైన మోహరింపు లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందా అనేది కూడా పరిశీలిస్తున్నారు.

కోల్‌కతా పోలీసు కమిషనర్ అజయ్ కుమార్ నంద్ పండల్ పక్కనుంచి వెళ్లే రోడ్లపై అక్టోబర్ 20 వరకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, గ్రూప్ డి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.  

ఈ ఘటనలో గాయపడిన 25 మందిలో 14 మంది ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. ఒకరి పరిస్థితి క్రిటికల్ గా ఉండగా, మిగిలిన ఇద్దరు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.