సినిమా పోస్టర్లకు రంగులు వేసిన 13 ఏళ్ల సాధారణ కుర్రాడు... మూడు జాతీయ పురస్కారాలతో దేశం గర్వించే మహానటుడిగా ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. 'పరిందా'లోని క్రూరత్వం మొదలు.. 'నటసామ్రాట్'లోని విషాదం వరకు, నానా పటేకర్ నటనలోని ఆవేశం, అభినయ విన్యాసం ఇండియన్ సినిమాకు లభించిన అరుదైన కానుక. భౌతికంగా ఆయన దూరమైనా నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మూస సినిమా ధోరణులకు భిన్నంగా తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో నటశిఖరంగా ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
సినిమా పోస్టర్‌తో మొదలై..
అనుభూతి చెందేలా చేసే నటన, ఆలోచింపజేసేలా సాగే డైలాగ్ డెలివరీతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు నానా పటేకర్. 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుద్-జంజీరాలో ఆయన జన్మించారు. తన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆర్థిక ఇబ్బందులతో 13 ఏళ్లకే ముంబైలో సినిమా పోస్టర్లకు రంగులు వేయడం లాంటి పనులు చేశారు.
ఆ తర్వాత ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే మరాఠీ నాటక రంగం వైపు ఆకర్షితులయ్యారు. నాటకాల్లో ఆయన నటన పలువురు ఫిల్మ్‌మేకర్ల దృష్టిని ఆకర్షించింది. 1978లో ముజఫర్ అలీ దర్శకత్వం వహించిన ‘గమన్’ చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పదేళ్ల పాటు హిందీ, మరాఠి చిత్రాల్లో చిన్న చిన్న సహాయ పాత్రలు పోషిస్తూ గుర్తింపు కోసం ప్రయత్నించారు. 1984లో వచ్చిన ఆజ్ కీ ఆవాజ్, 1986లో వచ్చిన అంకుశ్, 1987లో ప్రతిఘాత్ వంటి చిత్రాల్లో యాంగ్రీ మ్యాన్ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
‘పరిందా’తో కెరీర్‌కు బ్రేక్
1989లో విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’లో గ్యాంగ్‌స్టర్ ‘అన్నా సేథ్’ పాత్ర నానాజీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఇక ‘క్రాంతివీర్’ (1994)లో సమాజంలోని అవినీతి, మతోన్మాదంపై గళమెత్తే నిరుద్యోగి ప్రతాప్ నారాయణ్ తిలక్‌గా క్లైమాక్స్‌లో ఆయన చెప్పే డైలాగ్స్ హిందీ సినిమా హిస్టరీలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వరించింది. 1996లో వచ్చిన ‘అగ్నిసాక్షి’లో భార్యను అతిగా అనుమానించే సైకోపతిక్ భర్త పాత్రలో భయాన్ని, భావోద్వేగాలను అద్భుతంగా పండించి, ఉత్తమ సహాయ నటుడిగా మూడో జాతీయ పురస్కారం అందుకున్నారు.
క్యారెక్టర్ ఏదైనా..
1991లో వచ్చిన ‘ప్రహార్’తో దర్శకుడిగా మారిన ఆయన, ఇందులో సమాజంలోని నేరాలను ప్రశ్నించే సైనికుడి పాత్ర కోసం నిజమైన ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారు. తిరంగా, అబ్ తక్ ఛప్పన్, యశ్వంత్ లాంటి చిత్రాల్లో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు. ‘అంగార్’లో గ్యాంగ్‌స్టర్‌గా, అపహరణ్, కాలా చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉండే పొలిటీషియన్‌గా కనిపించారు.
కెరీర్‌లో ఎన్నో సీరియస్ క్యారెక్టర్స్ చేసిన ఆయన.. ‘వెల్‌కమ్’ లాంటి చిత్రాల్లో కామెడీ డాన్‌గా హాస్య పాత్రలతోనూ మెప్పించారు. ఇందులోని ‘కంట్రోల్ ఉదయ్ కంట్రోల్’ డైలాగ్ ఎంతో పాపులర్ మీమ్‌గా మారింది. రాజనీతి, శక్తి: ది పవర్, సలామ్ బాంబే, డియోల్, టాక్సీ నెం 9211 లాంటి చిత్రాలు ఆయనకెంతో మంచి పేరు తెచ్చాయి.
టాలీవుడ్‌తో అనుబంధం
యాభై ఏళ్ల కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో నటించారు. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. మనసుకు నచ్చిన సినిమాలే చేశారు. తెలుగులో ఆయన నేరుగా సినిమాలు చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. క్రాంతివీర్, టాక్సీ నంబర్ 9211 సినిమాలను పుణ్యభూమి నాదేశం, గేమ్ టైటిల్స్‌తో మోహన్ బాబు రీమేక్ చేశారు.
అలాగే ఆయన మరాఠీలో నటించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని ‘రంగమార్తాండ’గా తెలుగులో రీమేక్ చేశారు కృష్ణవంశీ. అంతేకాదు.. కృష్ణవంశీ తీసిన తెలుగు సినిమా ‘అంత:పురం’ హిందీ రీమేక్‌లో నానా పటేకర్ విలన్‌గా నటించారు. అలాగే ‘యశ్వంత్’ అనే చిత్రం ‘సంచలనం’గా తెలుగులో రీమేక్ అయింది. వెంకటేష్ సినిమా ‘ప్రేమించుకుందాం రా’, బాలకృష్ణ ‘భైరవద్వీపం’ చిత్రాల్లో విలన్ రోల్స్‌కు మొదట నానాపటేకర్‌ను అనుకున్నప్పటికీ, ఆయన బిజీగా ఉండటం, ఇతర కారణాలతో కుదరలేదు. రజినీకాంత్ సినిమా ‘కాలా’లో పొలిటీషియన్‌గా నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించారు.
అవార్డులు
నటుడిగా మూడు నేషనల్ అవార్డులు (పరిందా, క్రాంతివీర్, అగ్నిసాక్షి చిత్రాలకు) అందుకున్నారు నానా పటేకర్. 2013లో కేంద్రం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఫిలింఫేర్ చరిత్రలో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ విలన్ విభాగాల్లో అవార్డులు అందుకున్న ఏకైక నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
