ఆవు వీడియో యూట్యూబ్లో పెట్టాడు.. అదే అతని జీవితాన్ని మార్చేసింది.. ఎందరికో మార్గదర్శకం అయ్యింది !

ఆవు వీడియో యూట్యూబ్లో పెట్టాడు.. అదే అతని జీవితాన్ని మార్చేసింది.. ఎందరికో మార్గదర్శకం అయ్యింది !

చిన్నప్పుడు తండ్రితో కలిసి రోజూ పొలానికి వెళ్లేవాడు. స్కూలుకు సెలవు వస్తే రోజంతా పొలం గట్ల మీద ఆడుతూ గడిపేవాడు. అలా రామ్‌‌‌‌కు వ్యవసాయంతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఫ్రెండ్స్‌‌‌‌ అంతా పై చదువుల కోసం సిటీలకు వెళ్తే.. అతను మాత్రం పొలం బాట పట్టాడు. ఒకసారి వాళ్ల ఆవును వీడియో తీసి, యూట్యూబ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. దానికి బాగా రీచ్‌‌‌‌ రావడంతో అనుకోకుండా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్​గా మారాడు. గ్రామీణ జీవితాన్ని డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌కు  తీసుకెళ్లి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 

రామ్ పర్మార్​ది మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఉజ్జయిన్ జిల్లాలో ఉన్న బిరాఖేడి గ్రామం. అతను ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటినుంచే రామ్‌‌‌‌కు మట్టి మీద ప్రేమ, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉండేది. వాళ్ల కుటుంబం తరతరాల నుంచి వ్యవసాయం మీదనే ఆధారపడింది. అందుకే దాన్ని ఒక పనిలా కాకుండా కుటుంబ వారసత్వంగా భావించేవాడు. గ్రామంలో యువకులంతా సిటీలకు వెళ్లి సెటిల్‌‌‌‌ అవుతుంటే రామ్ మాత్రం వ్యవసాయాన్నే కెరీర్‌‌‌‌గా ఎంచుకున్నాడు. 

యూట్యూబ్‌‌‌‌లోకి.. 

రామ్ తండ్రి 2017లో గుజరాత్ నుంచి ఒక అందమైన గిర్ జాతి ఆవును తీసుకొచ్చాడు. అది అతనికి బాగా నచ్చింది. దాంతో ఆవును మొబైల్‌‌‌‌తో వీడియో తీసి, తనకు తోచిన విధంగా ఎడిట్ చేశాడు. తర్వాత ‘గిర్ కో నాసల్’ పేరుతో యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేసి, అందులో వీడియోని అప్‌‌‌‌లోడ్ చేశాడు. అప్పటివరకు రామ్‌‌‌‌కు యూట్యూబ్‌‌‌‌ గురించి పెద్దగా తెలియదు. తన మొదటి వీడియోకే 1,700 వ్యూస్ వచ్చాయి. కామెంట్స్‌‌‌‌లో కొంతమంది ఆ ఆవు వివరాలు అడిగారు. ఆ కామెంట్స్‌‌‌‌కి సమాధానాలు చెప్తూ మరో వీడియో చేశాడు. ఆ వీడియోకు 24,000 వ్యూస్ వచ్చాయి. అప్పుడే రామ్‌‌‌‌కు వీడియోల ద్వారా తనకు తెలిసిన నాలెడ్జ్‌‌‌‌ని ఇతరులతో పంచుకోవచ్చు అనే విషయం అర్థమైంది. దాంతో చానెల్‌‌‌‌ పేరుని ‘ఫార్మర్ చాయిస్’గా మార్చాడు. అప్పటినుంచి చానెల్‌‌‌‌లో సాగులో మెళకువలు, ఫార్మర్‌‌‌‌‌‌‌‌ సర్వీసులపై వీడియోలు చేశాడు. సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఫార్మర్స్‌‌‌‌ స్టోరీలను షేర్ చేశాడు. ఇప్పుడు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా ఆవులకు సంబంధించిన వీడియోలతోపాటు తన ఫార్మ్ నుంచి డైలీ వ్లాగ్స్ కూడా చేయడం మొదలుపెట్టాడు. 

ఎన్నో సవాళ్లు.. 

రామ్‌‌‌‌ ఊళ్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య విపరీతంగా ఉండేది. సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో టెర్రస్‌‌‌‌ పైకి ఎక్కి వీడియోలు అప్‌‌‌‌లోడ్ చేయాల్సి వచ్చేది. దాంతో అతనికి ఎదురైన సమస్యల మీద కూడా వీడియోలు చేశాడు. ‘కంటెంట్ క్రియేషన్ చాలా కష్టం,  యూట్యూబ్‌‌‌‌లో ఆదాయం తక్కువ, వ్యవసాయంలో స్కామ్స్’ లాంటి అంశాల మీద చేసిన కంటెంట్‌‌‌‌ బాగా వైరల్‌‌‌‌ అయ్యింది. ఆ తర్వాత ఏ సవాళ్లు రామ్‌‌‌‌ను ఆపలేకపోయాయి. ప్రతి రెండు రోజులకు ఒక వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. దాంతో ‘ఫార్మర్ చాయిస్’కు సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరిగింది. 

ప్రస్తుతం చానెల్‌‌‌‌ను 19.3 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు. ఇప్పటివరకు 1500కుపైగా వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో అతని పేజీని 3 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీంతోపాటు అతను ‘ట్రాక్టర్ చాయిస్’ ‘టెకీ ఎరా’ పేరుతో మరో రెండు చానెళ్లు నడుపుతున్నాడు. మొదటి చానెల్‌‌‌‌లో ట్రాక్టర్లు, రెండో దానిలో టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. 

అందరూ వద్దన్నారు.. 

గ్రామాల్లో ఉండేవాళ్లు యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు చేస్తే సక్సెస్ కావడం కష్టం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని రామ్‌‌‌‌కు చాలామంది సలహా ఇచ్చారు. వాళ్ల నాన్నతో ‘‘మీవాడు వీడియోలు చేస్తున్నాడు. అందులో భవిష్యత్తు ఏముంది? మంచి పని వెతుక్కోమని చెప్పు” అనేవాళ్లు. దాంతో ఒక దశలో వాళ్ల నాన్న కూడా వీడియోలు మానేయాలని చెప్పాడు. షూటింగ్ చేసేటప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్లు రామ్‌‌‌‌ని చూసి నవ్వేవాళ్లు. అయినా.. రామ్‌‌‌‌ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.