ఈ రోజుల్లో మనం జిమ్‌కు వెళ్లినప్పుడు, ఫిట్‌గా ఉండటానికి ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం చాలా మామూలు విషయంగా మారిపోయింది. ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం ప్రజలు ఈ మెషీన్‌ను బాగా వాడుతున్నారు. కానీ, మన ఆరోగ్యాన్ని పెంచే ఈ మెషీన్‌ను ఒకప్పుడు మనుషులను హింసించడానికి, శిక్షించడానికి తయారుచేశారని మీకు తెలుసా...?
అవును, మీరు విన్నది నిజమే... ట్రెడ్‌మిల్ కనిపెట్టడానికి అసలు కారణం ఫిట్‌నెస్ అస్సలు కాదు.. అదొక క్రూరమైన శిక్షగా మొదలైంది. గతంలో దీనిని ఎలా వాడేవారో తెలుసా...
ఖైదీలను శిక్షించడం కోసం
1818లో బ్రిటిష్ కు చెందిన ‘విలియం క్యూబిట్’ అనే ఇంజనీర్ ఒక వింత మెషీన్‌ను కనిపెట్టాడు. దానికి ఆయన ‘ట్రెడ్‌వీల్’ అని పేరు పెట్టాడు. ప్రజల ఆరోగ్యం బాగుపడాలని ఆయన దీనిని తయారుచేయలేదు.... కానీ జైల్లో ఉండే ఖైదీలకు బుద్ధి చెప్పడానికి, వారితో కష్టమైన పనులు చేయించడానికి దీనిని డిజైన్ చేశాడు. ఆ రోజుల్లో ఈ మెషీన్ అంటేనే ఖైదీలు గజగజ వణికిపోయేవారు.
కింద పడిపోయే ప్రమాదం
ఆ కాలంలో ఉన్న ట్రెడ్‌వీల్.. ఇప్పుడు మనం జిమ్‌లలో చూసే ట్రెడ్‌మిల్‌లా సింపుల్‌గా ఉండేది కాదు. అది చాలా పెద్దగా, ఒక పెద్ద చక్రంలా ఉండేది. ఖైదీలను దానిపై నిలబెట్టి ఆపకుండా నడవమని బలవంతం చేసేవారు. అంతం లేని మెట్లు ఎక్కుతున్నట్లుగా ఖైదీలకు అనిపించేది. దీనిపై నడిచేటప్పుడు ఖైదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త అలసిపోయి ఆగినా, విశ్రాంతి తీసుకున్నా బ్యాలెన్స్ తప్పి మెషీన్ పైనుంచి కింద పడిపోయే ప్రమాదం ఉండేది.
క్రూరత్వం.. కఠినమైన పని
ఈ మెషీన్‌పై ఖైదీలు నడవడం వల్ల వచ్చే శక్తిని (Energy) కొన్ని జైళ్లలో ధాన్యం దంచడానికి, బావుల నుంచి నీళ్లు తోడటానికి వాడేవారు. కానీ అన్ని జైళ్లలో దీని వల్ల ఉపయోగం ఉండేది కాదు. చాలా జైళ్లలో కేవలం ఖైదీలను హింసించడానికి, శిక్షించడానికి మాత్రమే దీనిని వాడేవారు. అంటే, ఎటువంటి ఉపయోగం లేకపోయినా కూడా ఖైదీలతో గంటల తరబడి ఆ చక్రంపై నడిపించేవారు.
రోజుకు 6 నుండి 8 గంటల హింస
ఈ పని వల్ల ఖైదీలు శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా చాలా కుంగిపోయేవారు. ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు ఆ మెషీన్‌పై ఖైదీలను ఆపకుండా నడిపించేవారు. కాలం గడిచేకొద్దీ.. ఈ మెషీన్ ఖైదీలను మార్చడానికి కాకుండా, క్రూరత్వానికి ఒక గుర్తుగా మారింది. ఈ దారుణమైన హింస కారణంగా, 19వ శతాబ్దం చివరలో ఈ మెషీన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకప్పుడు ఖైదీలను హింసించిన ఆ మెషీనే, మెల్లిమెల్లిగా మారి.. ఈ రోజు మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక పాపులర్ ఫిట్‌నెస్ మెషీన్‌గా మారింది.
