ఆయిల్ గోడౌన్ లో అగ్నిప్రమాదం

ఆయిల్ గోడౌన్ లో అగ్నిప్రమాదం
  •     అర్ధరాత్రి భారీగా ఎగసిపడుతున్న మంటలు  
  •     అదుపులోకి తెస్తున్న ఫైర్ ఇంజన్లు
  •     టోలిచౌకిలో ఘటన.. తప్పిన ప్రాణనష్టం

మెహిదీపట్నం, వెలుగు : ఓ ఆయిల్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. టోలిచౌకిలోని పెట్రోల్ పంప్ పక్కన యూసుఫ్ టెక్ డి ఉంది. దాని వెనక భాగంలో ఓ ఆయిల్ గోడౌన్ ఉంది. శుక్రవారం రాత్రి గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండగా.. సుమారు 7 ఫైరింజన్లు ఆర్పేందుకు ప్రయత్నించాయి.  

అగ్ని ప్రమాదం తెలియడంతో కార్వాన్  ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, బల్దియా అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖలో అధికారులు వెంటనే అక్కడికి చేరారు. ఫైర్ ఇంజన్లలో వాటర్ అయిపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి10:30 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కౌసర్ వెంటనే జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నీళ్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినా.. ఎలాంటి ప్రాణం నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. టోలిచౌకి లోని మెయిన్ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.