ఒకప్పుడు బైక్ అంటే పురుషులదే అన్న అభిప్రాయం.. ఇప్పుడు ఆ అభిప్రాయాన్నే తిప్పికొడుతున్నారు హైదరాబాద్ మహిళలు! చేతిలో హ్యాండిల్.. కళ్లలో గమ్యం.. గుండెల నిండా సాహసం! వీకెండ్ వచ్చిందంటే చాలు.. నగర రోడ్ల నుంచి కొండకోనలు, చారిత్రక కట్టడాలు, పుణ్యక్షేత్రాల వరకు బైక్‌లపై దూసుకెళ్తున్నారు. బైక్ రైడింగ్‌ను హాబీగా మొదలుపెట్టి.. ఇప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మహిళా బైకర్ల సాహసయాత్ర ఇది !
హైదరాబాద్‌లో మహిళలకు బైక్ రైడింగ్ నేర్పించేందుకు పలు కమ్యూనిటీలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ బైకెర్నీ, షీ మోటో, తెలంగాణ ఉమెన్ మోటో బైకర్స్ వంటి సంస్థలు వారాంతపు రైడ్స్, సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్ల ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. కొత్తగా బైక్ నేర్చుకోవాలనుకునేవారికి కొన్ని కమ్యూనిటీలు ప్రత్యేక శిక్షణా తరగతులనూ నిర్వహిస్తున్నాయి. ఆయా సంస్థల సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలి మహిళల మోటార్‌సైక్లింగ్ క్లబ్‌గా గుర్తింపు పొందింది హైదరాబాద్ బైకెర్నీ. దీంతోపాటు నగరంలో పలు మహిళా బైకింగ్ కమ్యూనిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయి.
బైక్ రాణి, షీ మోటో, తెలంగాణ ఉమెన్ మోటో బైకర్స్ వంటి క్లబ్‌లు మహిళలకు రైడింగ్‌పై ఆసక్తిని పెంచడంతోపాటు వారాంతాల్లో సాహసయాత్రలు నిర్వహిస్తున్నాయి. అడ్వెంచర్ రైడ్స్, ఆలయ యాత్రలు, సామాజిక అవగాహన ర్యాలీల్లో మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 500 మంది మహిళా బైకర్లు నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హైదరాబాదీ
హైదరాబాద్‌కు చెందిన హారిక మండలపు అత్యంత ఎత్తైన మోటారు వాహన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ లా పాస్‌కు బైక్‌పై ప్రయాణించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు. లేహ్ ప్రాంతం నుంచి సుమారు19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా వరకు ఆమె సాగించిన యాత్ర సాహసానికి నిదర్శనంగా నిలిచింది. హారికను తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు.
షీ మోటో.. ఆత్మ విశ్వాసమే ఇంధనం
హైదరాబాద్‌కు చెందిన ‘షీ మోటో’ మహిళలకు బైక్ రైడింగ్‌లో శిక్షణ ఇస్తున్న మరో ప్రముఖ కమ్యూనిటీ. దీని వ్యవస్థాపకురాలు, లీడ్ కోచ్ లీనా రెడ్డి బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూనే మోటార్సైక్లింగ్పై ఆసక్తితో ఈ సంస్థను ప్రారంభించారు. మహిళలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో బైక్ నడపడం నేర్చుకోవాలన్నదే ఆమె లక్ష్యం.
లీనారెడ్డి చెప్పిన ఓ శిక్షణార్థి కథ ఎంతో స్ఫూర్తినిస్తుంది. పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన 40 ఏళ్ల మహిళ తన15 ఏళ్ల కుమార్తె కోసం బైక్ రైడింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తండ్రి జ్ఞాపకంగా ఇంట్లో ఉన్న ఆయన బుల్లెట్ మోటార్ సైకిల్‌ను ఎప్పటికైనా నడపాలన్నది ఆ అమ్మాయి కోరిక. కుమార్తెకు ఆత్మవిశ్వాసాన్ని అందించడంతోపాటు భర్త జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆ తల్లి శిక్షణ తీసుకుంది. నేడు ఆమె ధైర్యంగా బైక్ నడుపుతుండటం కుటుంబసభ్యులు, స్నేహితులను ఆనందపరుస్తోందని లీనారెడ్డి తెలిపారు.
తరణి నాయుడు.. 40 వేల కిలోమీటర్ల సాహసం
పోషకాహార నిపుణురాలైన తరణి నాయుడుకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. లేహ్ – లడఖ్‌తోపాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కలిపి సుమారు 40 వేల కిలోమీటర్ల మేర బైక్ రైడింగ్ చేసిన అనుభవం ఆమె సొంతం. పలు రైడింగ్ పోటీల్లోనూ విజయం సాధించారు. బైక్ నడపడం నేర్చుకునే మహిళ కేవలం మోటార్‌సైకిల్‌ను నియంత్రించడం మాత్రమే నేర్చుకోదని, తాను కోరుకున్న చోటికి వెళ్లే స్వేచ్ఛను కూడా పొందుతుందని తరణి చెప్తున్నారు.
బజాజ్ చేతక్ నుంచి హిమాలయన్ దాకా..
హైదరాబాద్‌కు చెందిన అనీషా ఫాతిమా లతీఫ్ ఫిట్నెస్ రంగంలోనే కాకుండా మోటార్సైక్లింగ్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిట్నెస్ వ్యవస్థాపకురాలిగా, సర్టిఫైడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పనిచేస్తున్న ఆమెకు చిన్నప్పటి నుంచే బైక్ రైడింగ్‌పై ఆసక్తి ఉంది. తాతగారికి చెందిన 1989 నాటి బజాజ్ చేతక్‌తో ఆమె మోటార్‌సైకిల్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఎలెక్ట్రా 350, థండర్బర్డ్ 350ఎక్స్ వంటి బైక్‌లను నడిపారు. ప్రస్తుతం హిమాలయన్ 411తో రైడింగ్ కొనసాగిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు వాహన రహదారిగా గుర్తింపు పొందిన ఉమ్లింగ్ లాకు మరో ఏడుగురు మహిళలతో కలిసి ఆమె సాహసయాత్ర చేశారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ స్థాయులు వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రయాణం పూర్తి చేశారు.
2023లో బైకెర్నీ హైదరాబాద్ తెలంగాణ విభాగానికి నాయకత్వం వహించిన అనీషా.. మహిళా రైడర్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేశారు. మహిళలు ఐక్యత, ధైర్యం, పట్టుదలతో కఠినమైన ప్రయాణాలనూ విజయవంతంగా పూర్తి చేయగలరని నిరూపించడమే తన లక్ష్యమని ఆమె చెప్తున్నారు.
ఫిట్నెస్, వెల్నెస్ కోచ్‌గా..
అనీషా ఫాతిమా లతీఫ్ తండ్రి ఫిట్నెస్, వెల్నెస్ కోచ్. పీసీఓడీ, హార్మోన్ల అసమతుల్యత సమస్యల కారణంగా ఒకప్పుడు 105 కిలోల బరువున్న అనీషా సహజమైన ఫిట్నెస్ పద్ధతుల ద్వారా బరువు తగ్గారు. ప్రస్తుతం ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉన్న స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా అథ్లెట్లు, వృద్ధులు, క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
ఉపాధి మార్గంగానూ బైక్ రైడింగ్
బైక్ రైడింగ్ మహిళలకు సాహసంతో పాటు ఉపాధి అవకాశాలనూ అందిస్తోంది. హైదరాబాద్‌లో స్త్రీ రైడ్, ర్యాపిడో పింక్ వంటి మహిళా ప్రయాణ సేవలు ఈ దిశగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళా డ్రైవర్లు బైక్‌లు, ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. దీంతో రైడింగ్ కేవలం హాబీగానే కాకుండా ఆర్థిక స్వావలంబనకు మార్గంగానూ మారుతోంది. మహిళలకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం కాదు.. స్వేచ్ఛకు ప్రతీక! రోడ్డుపై దూసుకెళ్లే ప్రతి రైడ్ ఒక కొత్త అనుభవం.. ప్రతి మలుపు ఒక సవాలు.. ప్రతి గమ్యం ఓ విజయం!
హైదరాబాద్ బైకెర్నీ.. 13 ఏళ్ల ప్రస్థానం
2013లో ప్రారంభమైన హైదరాబాద్ బైకెర్నీ మహిళా మోటార్‌సైక్లింగ్ క్లబ్ మహిళలకు రైడింగ్‌పై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఐటీ ఉద్యోగులు, బ్యాంకర్లు, వైద్యులు సహా వివిధ రంగాలకు చెందిన 19 నుంచి 53 ఏళ్ల వయసున్న మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యం, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఈ కమ్యూనిటీ పాల్గొంటోంది.
హైదరాబాద్ నుంచి మున్నార్, శ్రీనగర్ నుంచి కార్గిల్, హైదరాబాద్ నుంచి పాఖాల సరస్సు, అనంతగిరి కొండల వరకు పలు ప్రాంతాలకు రైడ్స్ నిర్వహించింది. లేహ్–లడఖ్ వంటి సుదూర ప్రాంతాలకూ మహిళా బైకర్లు ప్రయాణాలు సాగిస్తున్నారు. బైక్ రైడింగ్‌లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హెల్మెట్లు, రైడింగ్ బూట్లు, రక్షణ కల్పించే జాకెట్లు, రాత్రివేళ ప్రయాణానికి అనువైన కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు.
జైసల్మేర్ ట్రయల్ స్టార్మ్ 2026లో మెట్టు బాంధవి
ముషీరాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థిని మెట్టు బాంధవి అక్టోబర్ 30, 31 తేదీల్లో జరగనున్న జైసల్మేర్ ట్రయల్ స్టార్మ్ 2026 బైక్ రైడ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ముషీరాబాద్ నుంచి జైసల్మేర్‌కు బైక్ యాత్ర చేపట్టారు. మూడోవర్ టీమ్ ఆధ్వర్యంలో 16 రోజులపాటు సుమారు ఐదు వేల కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రలో ఆరుగురు మహిళలు పాల్గొంటున్నారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సాధికారతను చాటిచెప్పడం తన రైడింగ్ లక్ష్యమని బాంధవి తెలిపారు. లడఖ్, లేహ్, హిమాలయ ప్రాంతాలు, ఖార్దుంగ్ లా, ఉమ్లింగ్ లా, పాంగోంగ్ సరస్సు, నుబ్రా లోయ, మాగ్నెటిక్ హిల్ వంటి ప్రాంతాలకు బైక్‌పై ప్రయాణించాలనే ఆసక్తితో ఆమె ముందుకు సాగుతున్నారు.
