కారులో చోరీకి వెళ్తే..వాడి కారునే ఎత్తుకెళ్లాడింకొకడు

కారులో చోరీకి వెళ్తే..వాడి కారునే ఎత్తుకెళ్లాడింకొకడు

తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకోడుంటాడట.. అలాంటి సంఘటనే ఇది. ఓ దుకాణాన్ని దోచుకోవడానికి ఒకడు కారులో వెళితే, ఆ కారునే కొట్టేశాడు ఇంకోడు. అయ్యో నా కారును ఎవరో ఎత్తుకెళ్లారంటూ కంప్లైంట్​ చేస్తే, వాడి సంగతి తర్వాత చూద్దాం అంటూ వీడిని పోలీసులు లోపలేశారు. వాషింగ్టన్​లోని కెన్నెవిక్​లో జరిగిన ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ఇప్పుడు సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే.. కెన్నెవిక్​కు చెందిన విలియం కెల్లీ ఆదివారం పొద్దున్నే ఓ దుకాణంలోకి వెళ్లాడు. పార్కింగ్ ​ప్లేస్​లో కారు పార్క్ ​చేసి లోపలికి అడుగుపెట్టాడు. సరుకులు తీసుకుంటుండగా కారు దగ్గర ఓ యువకుడు తిరుగాడుతుండడం చూసి కెల్లీ బయటికొచ్చాడు. ఈలోపే ఆ యువకుడు కారులో కూర్చుని స్టార్ట్​ చేశాడు. కెల్లీ పరిగెత్తుకొచ్చేలోగానే ఉడాయించాడు. వెంటబడినా ఉపయోగంలేకపోవడంతో కెల్లీ పోలీసులకు ఫోన్ ​చేశాడు. వాళ్లు వచ్చీ రాగానే పోయిన తన కారు గురించి ఊదరగొట్టాడు. ఎలాగైనా దొంగను పట్టుకోవాలన్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో మరో కొత్త విషయం బయటపడింది. కారును పోగొట్టుకున్న కెల్లీ కూడా దొంగేనని, సరుకులు కొనేందుకు కాదు ఆ దుకాణాన్ని దోచుకోవడానికే వచ్చాడని తేలింది. దీంతో కారు దొంగ సంగతి తర్వాత చూద్దాం.. ముందైతే నువ్వు లోపల రెస్టు తీసుకో అంటూ కెల్లీని జైల్లో వేశారు. పోయిన కారును, కారు దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారట. సీసీటీవీ ఫుటేజీనీ కెన్నెవిక్ పోలీసులు ఫేస్​బుక్​లో అప్​లోడ్​చేయడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరేమో ‘ఛ.. సాటి దొంగనే గౌరవం కూడా లేదు’ అని, ‘కర్మ ఫలితం’ అని మరొకరు.. అంటూ పలువురు కామెంట్ చేశారు.