National Dengue Day:డెంగ్యూ కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్

National Dengue Day:డెంగ్యూ  కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్

డెంగ్యూ.. ఇది కేవలం జ్వరం మాత్రమే..  అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కొంచెం విశ్రాంతి తీసుకుని ఓ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అయితే డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. కాలేయ సమస్యలు, రక్తస్రావ సమస్యలు,ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోవడం,  కొన్ని సార్లు షాక్ సిండ్రోమ్‌కు కూడా కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారవచ్చు. మే16, 2026 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ బారిన పడకుండా  ఎలా కాపాడుకోవాలి..డెంగ్యూ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.. 

డెంగ్యూ లక్షణాలు..

డెంగ్యూ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, కొన్ని సందర్భాల్లో కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ  లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

డెంగ్యూ నివారణకు జాగ్రత్తలు..

  • ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
  • కూలర్లు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వకుండా చూడాలి.
  • కిటికీలు, తలుపులకు దోమ తెరలు ఉపయోగించాలి 
  • దోమల నివారణ క్రీములు లేదా స్ప్రేలు ఉపయోగించాలి.
  • శరీరంలో నీరు తగ్గకుండా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి.

 వాతావరణంలో నిరంతర మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఏడాది పొడవునా డెంగ్యూ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే వర్షాకాలం అయిన జూన్ -నవంబర్ నెలల్లో దీని తీవ్రత గరిష్టంగా ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు. అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ, పరిసరాల పరిశుభ్రతా కార్యక్రమాల ద్వారా డెంగ్యూ కేసులను గణనీయంగా తగ్గించి ప్రాణాలను కాపాడగలమని అంటున్నారు.  డెంగ్యూ కేవలం మరో జ్వరం కాదు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.