నీటి కుంటలో మునిగి ముగ్గురు మృతి..బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ 

నీటి కుంటలో మునిగి ముగ్గురు మృతి..బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ 
  •  మృతుల్లో ఇద్దరు యువతులు, ఒక చిన్నారి
  • మృతులంతా ఖమ్మం జిల్లా వలస కుటుంబాలకు చెందినవారే.. 
  • బాధిత కటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంపీ వంశీకృష్ణ 

జైపూర్, వెలుగు : ఉపాధి కోసం వలస వచ్చిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగలగూడెం గ్రామానికి చెందిన వివాహిత మోటం మణియమ్మ(24), మోటం కీర్తన(16), మాదేవి కావ్య(9) బంధువులు. వారు శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాసీంపల్లి గ్రామానికి వలస వచ్చి గుడారాలు వేసుకున్నారు. గ్యాస్ స్టవ్ రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, కుటుంబానికి చెందిన మగవాళ్లు ఆదివారం ఉదయం గ్యాస్​ స్టవ్​రిపేర్ల కోసం ఆయా గ్రామాలకు వెళ్లారు. గుడారాల వద్ద ఉన్న మణియమ్మ, కీర్తన, కావ్య కలిసి సమీపంలోని నీటి కుంటలో  బట్టలు ఉతికేందుకు వెళ్లారు. 

సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో బంధువులు వారి కోసం వెతికారు. నీటి కుంట ఒడ్డున ముగ్గురికి సంబంధించిన చెప్పులు, దుస్తులు కనిపించడంతో నీటిలో గాలించగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కొత్త ప్లేస్​కావడంతో నీటి కుంట లోతుపై అవగాహన లేకపోవడం, ముగ్గురికి ఈత రాకపోవడంతో బట్టలు ఉతుకుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం పట్ల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలాన్ని జైపూర్ సీఐ నవీన్​కుమార్, ఎస్సై భూమేశ్ సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన నీటి కుంట ఇందారం గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు లింగయ్యకు సంబంధించినదిగాగుర్తించారు. మట్టి కోసం తవ్విన కుంట చుట్టూ ఎలాంటి కంచె వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

జైపూర్ మండలం కాసీంపల్లి గ్రామ శివారులోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రమాదకర గుంతలు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.