ప్రకృతి చాలా అందమైనది.. దానిని చూస్తుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది, కొన్ని కొన్ని ప్రదేశాలను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో వింతలు ప్రకృతి ఒడిలో దాసోహమయ్యాయి. ఇంకా ఎన్నో విశేషాలకు తనలోనే దాచుకుంది ప్రకృతి.. అలాంటి వాటిని చూసినప్పుడు నిజంగా అలాంటి ఉన్నాయా అని పిస్తుంది. అలాంటి చిత్ర విచిత్రమూ ప్రకృతిలో దాగిఉన్న మూడు వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . .!
పాము లాంటి గుహలు
అచ్చం పాములా ఉండే గుహల్ని ఎప్పుడైనా చూశారా? థాయ్ లాండ్ లోని బ్యూంగ్కాన్ ప్రావిన్స్ లో ఉన్న నేషనల్ పార్క్ ని నాకా కేవ్స్ అచ్చంగా పాము లాగానే ఉంటాయి. ఇది రాయిలా మారిపోయిన పాము అని అక్కడి వాళ్లు నమ్ముతారు.
థాయ్ లాండ్ లో ఉన్న 'పు లంగ్ కా ' అనే నేషనల్ పార్క్ మూడు పర్వతాల పొరలు ఉన్నాయి. ఇవి మెకాంగ్ అనే నది చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఉండే కొండలు అచ్చంగా పాము చర్మాన్ని పోలి ఉంటాయి. అందుకే వీటిని 'నాకా కేవ్స్' లేదా 'నాగా కేవ్స్' అంటారు. ఈ గుహల వెంట ఉండే రాళ్లపై అచ్చంగా పాము చర్మం లాంటి ప్యాటర్న్ ఉంటుంది.
అయితే ఇవి నిజంగా అలా తయారయ్యాయా? లేదా మనుషులు డిజైన్ చేశారా? అన్నది మాత్రం తెలియదు. ఆ శిలలు సుమారు లక్ష సంవత్సరాల క్రితం నాటివని ఆర్కియాలజిస్టులు తేల్చారు. నాకా గుహల వల్లే ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయని, ఒక పెద్ద పాము రాయిలా మారిపోవడం వలన అవి ఏర్పడ్డాయని అక్కడి వాళ్లు నమ్ముతుంటారు.
భయపెట్టే పువ్వు
పువ్వులు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి అనుకుంటారు చాలామంది. అయితే చూడగానే భయపెట్టే పువ్వులు కూడాబకొన్ని ఉన్నాయని తెలుసా? స్నాప్ డ్రాగన్ పువ్వు లేదా డ్రాగన్ స్కల్ ఫ్లవర్ ను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలోని వికారమైన పువ్వు ల్లో ఇదీ ఒకటి. రూపాన్ని బట్టి దానికా పేరు వచ్చింది. ఈ పువ్వు మొదట్లో బాగానే ఉన్నా దాన్నుంచి విత్తనం బయటకు వచ్చినప్పుడు, ఈ పువ్వు రూపం మారిపోతుంది. ముందు డ్రాగన్ ముఖంలా... ఆ తర్వాత ఎండిపోయే కొద్దీ వేలాడుతున్న పుర్రెలా కనిపిస్తుంది. ఇవి యూరప్, కెనడాల్లో ఎక్కువగా పెరుగుతాయి
బుల్లి విల్లో చెట్టు
ప్రపంచంలో అతి చిన్న చెట్టు పొడవెంతో తెలుసా? అక్షరాలా ఆరు సెంటీ మీటర్లు అయితే ఇదేదో చిన్న గడ్డి మొక్క లాంటిది కాదు. నిజంగా చెట్టు. అంటే దీనికి ఆకులు, కాండం ఉంటాయి. ఈ బుల్లి చెట్టుకి కాయలు కాసి పంటకు కూడా వస్తాయి.
ఆరు సెంటీమీటర్ల పొడవు, రెండు సెంటీ మీటర్ల వెడల్పు మాత్రమే పెరిగే బుల్లి చెట్టు పేరు ద్వార్స్ విల్లో, దీన్ని 'సాలిక్స్ హెర్బాసియా' అని కూడా అంటారు. ఇది నార్త్ అట్లాంటిక్, నార్త్ యూరప్, కెనడా, గ్రీన్ లాండ్ రీజియన్ లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ చెట్టుకి ఎర్రటి పండ్లు కూడా కాస్తాయి. అవి పండిన తర్వాత పసుపురంగులోకి మారతాయి.
దీని విత్తనాలు తేలికగా ఉండడంతో గాలిలోకి ఎగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడతాయి. వాతావరణాన్ని బట్టి మొలకెత్తుతాయి. ఈ బుల్లి చెట్లు ఎత్తైన ప్రాంతాల్లో కూడా పెరగగలవు. ఇవి సుమారు 12 నుంచి 43 ఏండ్ల వరకూ బతకగలవు.
