బాలికతో అసభ్య ప్రవర్తన..నిందితుడికి మూడేండ్ల కఠిన జైలు శిక్ష

బాలికతో అసభ్య ప్రవర్తన..నిందితుడికి మూడేండ్ల కఠిన జైలు శిక్ష

నిర్మల్, వెలుగు : ఇంటి ముందు ఆడుఉంటున్న అభంశుభం తెలియని ఓ పదేండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామాంధుడికి నిర్మల్​ జిల్లా ఫోక్సో కోర్టు మూడేండ్ల కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలను లైజన్ ఆఫీసర్ సక్రియా నాయక్ వెల్లడించారు. నిర్మల్​ జిల్లాలోని గాజుల్ పేట్​కు చెందిన కుదరత్ అలీ జిల్లా కేంద్రంలోని గల్లీల్లో సీసాలు ఏరుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. 2017 అక్టోబర్ 11న నాయుడు వాడకు చెందిన ఓ పదేండ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆమెతో అలీ అసభ్యంగా ప్రవర్తించాడు.

దీన్ని గమనించిన స్థానికుడు సంతోష్ బెదిరించడంతో అలీ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రమణారావు, విశ్వాస్ రెడ్డి 9 మంది సాక్షులను విచారించి నేరాన్ని రుజువు చేశారు. దీంతో జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ గురువారం నిందితుడికి మూడేండ్ల కఠిన జైలు శిక్షను ఖరారు చేశారు.