తిరుపతి: తిరుమలలో వేంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. దసరా రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని 83 వేల 745 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం రూ.2.99 కోట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.
భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కలియుగ దేవుడు.. వైకుంఠ నాథుడు.. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఏడుకొండలపై పాదయాత్ర చేసి వెంకన్న స్వామిని దర్శించారంటే ఆ అనుభూతి అంతా ఇంతా కాదు. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన ఏడుకొండలు పైన ఉంటాడు.
ఈ ఏడుకొండలు ఎక్కడం వెనుక కూడా ఒక రహస్యం ఉంది. పురాణాల ప్రకారం ఆ ఏడుకొండలు సాలగ్రామాలే. ఆ ఏడుకొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు అన్నీ మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
