ఆ హీరో ఎవరు..? లావణ్య చాటింగ్ లిస్టులో వీఐపీలు

ఆ హీరో ఎవరు..?  లావణ్య చాటింగ్ లిస్టులో వీఐపీలు

 

  •  సినీ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ లింకు
  • మలుపు తిరిగిన టిఫిన్స్ డ్రగ్ కేసు
  •  లావణ్య సోషల్ మీడియా అకౌంట్లపై పోలీసుల దృష్టి
  • చాలా మంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు
  • రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి

హైదరాబాద్: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీల‌క అంశాలు వెల్లడి అయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం హైదరాబాద్ వచ్చిన లావ‌ణ్య టాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ట్రై చేసింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్​లో నటించింది. అందులో హీరోయిన్‌గా నటిస్తూ జల్సాలకు అలవాటు ప‌డింది. ఈక్రమంలో ఓ టాలీవుడ్ హీరోతో ఆమెకు ప‌రిచ‌యం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమ‌గా మారింది. ఆ టాలీవుడ్ ఎవరు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత  కొంత కాలంగా డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ కు చెందిన పలువురు  ప్రముఖులు విచారణ సైతం ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నార్కొటిక్ అనాలిసిస్ వింగ్ ను బలోపేతం చేశారు. దీనికి సందీప్ శాండిల్యను నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైతం డ్రగ్స్ కేసులను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య రిమాండ్ రిపోర్ట్ కొత్త చర్చకు తెరలేపింది. ఆమెతో ప్రేమలో పడ్డ హీరో ఎవరు..? టాలీవుడ్ లో ఆయన ప్రభావం ఎంత..? ఆయన డ్రగ్ అడిక్టరా..? ఇంకా ఎవరెవరికి సరఫరా చేశారు..? లావణ్యకు చాలా మంది వీఐపీలతో పరిచయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. 

కాల్ డేటా.. సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి

నార్సింగ్ డ్రగ్స్ కేసులో లావ‌ణ్య.. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలుగా ఉంది. గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటుంది. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత వాట్సాప్ చాట్ ని ప‌రిశీలిస్తున్నారు. ఈక్రమంలో చాలా మంది వీఐపీల‌తో లావణ్యకు ప‌రిచ‌యాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కోర్టును అనుమ‌తితో క‌స్టడీలోకి తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత మ‌రిన్ని విష‌యాలు వెల్లడి అయ్యే చాన్స్​ఉంది.