FIFA World Cup Closing Ceremony: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల శ్వాస ఆగిపోయే క్షణం రానే వచ్చింది. 48 దేశాలు, 3 దేశాల ఆతిథ్యం, 16 నగరాలు.. చరిత్రలోనే అతి పెద్ద మెగా టోర్నీగా రికార్డు సృష్టించిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. జూలై 19, ఆదివారం రోజున న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే ఆ ఫైనల్ పోరు కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. దానికి 90 నిమిషాల ముందు జరగబోయే ముగింపు వేడుకల్లో (Closing Ceremony) మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయని ఫిఫా లీక్ చేసిన సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
మైదానంలోకి హాలీవుడ్ యాక్షన్ లెజెండ్:
ఫుట్‌బాల్ మైదానంలో సాధారణంగా క్రీడాకారులు పరుగెడుతుంటారు. కానీ ఈసారి క్లోజింగ్ సెర్మనీలో ఒక అనూహ్యమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. హాలీవుడ్ రారాజు, యాక్షన్ చిత్రాల కేరాఫ్ అడ్రస్ టామ్ క్రూజ్ (Tom Cruise) ఈ వేడుకలో ఒక స్పెషల్ అప్పియరెన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుందనే దానిపై నిర్వాహకులు అత్యంత గోప్యత పాటిస్తుండటంతో సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. దీనికి తోడు, తన పిచ్చి పిచ్చి చేష్టలతో యూట్యూబ్, సోషల్ మీడియాను ఊపేసే గ్లోబల్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఐషోస్పీడ్ (IShowSpeed) కూడా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ లైనప్‌లో భాగం కాబోతుండటం యూత్‌కు పూనకాలు తెప్పిస్తోంది. వీరితో పాటు అంతర్జాతీయ పాప్ తారలు లారా పాసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్ తమ లైవ్ షోలతో స్టేడియాన్ని షేక్ చేయనున్నారు. ఆస్కార్, గ్రామీ అవార్డు గ్రహీత జెన్నిఫర్ హడ్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించి ఈ అద్భుత ప్రదర్శనకు తెరలేపనున్నారు.
►ALSO READ | బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. బ్యాటింగ్‌లో తడబడిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?
మ్యాచ్‌కు ముందే ఆ 90 నిమిషాలే అసలైన కిక్:
ఈ విజువల్ వండర్ కరెక్ట్ గా మ్యాచ్ ప్రారంభం కావడానికి 90 నిమిషాల (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) ముందు ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు ప్రసిద్ధ బాలీచ్ వండర్ స్టూడియో (Balich Wonder Studio) భాగస్వామ్యంతో ఫిఫా ఈ షోను డిజైన్ చేసింది. ఈ అద్భుతాన్ని మిస్ కాకుండా లైవ్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం స్టేడియం గేట్లను ఉదయం 11 గంటలకే తెరిచి ఉంచనున్నారు. గేట్లు తెరిచిన సమయం నుంచే స్టేడియంలో ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ రన్ అవుతాయి.
అసలైన ట్విస్ట్: హాఫ్ టైమ్ షో వేరు.. క్లోజింగ్ సెర్మనీ వేరు:
ఇక్కడ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. చాలా మంది ఈ ముగింపు వేడుకలే మ్యాచ్ మధ్యలో జరిగే హాఫ్ టైమ్ షో (Halftime Show) అని అనుకుంటున్నారు. కానీ ఫిఫా దీనిపై క్లారిటీ ఇచ్చింది. మ్యాచ్‌కు ముందు జరిగే ఈ క్లోజింగ్ సెర్మనీ వేరు, మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో జరిగే హాఫ్ టైమ్ షో వేరు! ఈ రెండింటికీ విభిన్నమైన ఆర్టిస్టులు, విభిన్నమైన ప్రొడక్షన్స్ ఉంటాయి. అంటే, ఒకే రోజు ఫుట్‌బాల్ ప్రేమికులకు డబుల్ ధమాకా ఉండబోతుందని ఫిఫా తేల్చి చెప్పింది.
