స్పైడర్‌మ్యాన్‌కు తెలుగు పెళ్లి.. పట్టు పంచెల్లో అవెంజర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో!

స్పైడర్‌మ్యాన్‌కు తెలుగు పెళ్లి.. పట్టు పంచెల్లో అవెంజర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో!

హాలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ నటించిన లేటెస్ట్ మార్వెల్ చిత్రం 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి ఆరు రోజుల్లోనే రూ.10,925 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారత్‌లో కూడా రూ.362 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి మార్వెల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది.

అయితే మార్వెల్ అభిమానులు కూడా ఊహించని ఓ విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. స్పైడర్‌మ్యాన్ టామ్ హాలండ్ అచ్చం దక్షిణ భారతీయ పెళ్లికొడుకులా పట్టు పంచె కట్టుకుని పెళ్లి మండపంలో కూర్చుంటే.. వధువుగా జెండయా బంగారు జరీ చీరలో, టెంపుల్ జ్యువెలరీ, ఒడ్డియానం, మల్లెపూల జడతో సంప్రదాయ వధువులా మెరిసిపోయింది. నెట్టింట ఈ ఏఐ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇక పెళ్లి అతిథులుగా స్కార్లెట్ జోహాన్సన్, ఎలిజబెత్ ఒల్సెన్, ఎమ్మా స్టోన్ బంగారు అంచు చీరల్లో సందడి చేయగా.. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ తెల్లటి పంచెల్లో కనిపించి ఆకట్టుకున్నారు. మరోవైపు ఆంథనీ మ్యాకీ, సెబాస్టియన్ స్టాన్, మార్క్ రఫలో, హ్యూ జాక్‌మన్ లుంగీలు కట్టుకుని వంటలు చేయడం, భారీ పాత్రలు కలపడం, కుర్చీలు మోసుకెళ్లడం వంటి సన్నివేశాలు ఈ ఏఐ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ALSO READ : సారీ మోడీ జీ: భారత్‎కు క్షమాపణ లేఖ పంపిన జుకర్ బర్గ్

అంతే కాదు అరటి ఆకులపై విందు, జీలకర్ర-బెల్లం, తాళి కట్టే వేడుక, అక్షింతలు, మల్లెపూల హారాలు, చివర్లో తెల్లటి అంబాసిడర్ కారులో నవదంపతుల ప్రయాణం.. ప్రతి ఫ్రేమ్ దక్షిణ భారతీయ సంప్రదాయాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. ఇది పూర్తిగా ఏఐతో రూపొందించిన డిజిటల్ క్రియేషన్ మాత్రమే అయినప్పటికీ, నిజమైన సినిమా సన్నివేశంలా కనిపిస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. మీ క్రియేటివిటీ మాములుగా లేదు భయ్యా అంటూ కామెంట్ల వర్షం కురిస్తున్నారు.

 

ఈ వైరల్ వీడియోపై నటి సమీరా రెడ్డి సైతం స్పందిస్తూ..'ఈరోజు నేను చూసిన బెస్ట్ వీడియో ఇదే అంటూ ప్రశంసించారు.  'మల్టీవర్స్ ఇప్పుడు సౌత్ ఇండియాకు వచ్చింది', 'ఇది నిజంగా సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలయ్యేవి', 'అవెంజర్స్ – సౌత్ ఇండియన్ వెర్షన్ సూపర్ హిట్' అంటూ నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తున్నారు. మార్వెల్ ప్రపంచాన్ని, భారతీయ సంస్కృతిని ఒకే ఫ్రేమ్‌లో కలిపిన ఈ ఏఐ కాన్సెప్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.