మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మరోసారి బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని చాటింది. టామ్ హాలండ్ హీరోగా నటించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే సుమారు రూ.10,900 కోట్లకు పైగా వసూళ్లను దాటేసింది. కలెక్షన్స్ లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఐదు రోజుల్లో ఈ ఫీట్ సాధించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్'తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
భారత్‌లోనూ హవా..
భారత్‌లోనూ స్పైడర్‌మ్యాన్ హవా ఏమాత్రం తగ్గడం లేదు. తొలి వీకెండ్‌లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఆరో రోజు రూ.21.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. మొత్తం రూ.303.25 కోట్ల నెట్, రూ.362.61 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. హాలీవుడ్ చిత్రానికి వర్కింగ్ డేస్‌లో కూడా ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు భారీ స్పందన లభిస్తుండగా.. ఇంగ్లీష్ వెర్షన్ కూడా అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఊహించని రికార్డులు..
ఈ విజయంపై స్పందించిన మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైగీ, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ఓపెనింగ్ రికార్డును మరో MCU చిత్రం అధిగమిస్తుందని తాను ఊహించలేదన్నారు. కానీ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఆ చరిత్రను తిరగరాయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులను భారీగా రప్పించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
డెస్టిన్ డానియెల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండయా, జేకబ్ బటాలన్, మార్క్ రఫాలో, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్, ట్రామెల్ టిల్‌మన్ కీలక పాత్రల్లో నటించారు. టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగో సోలో మూవీ. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కథనం, విజువల్ ఎఫెక్ట్స్, MCU భవిష్యత్తుకు కీలకమైన ట్విస్టులతో ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇదే జోరు కొనసాగితే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో చేరనుంది. అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సూపర్ హీరో చిత్రాల జాబితాలోనూ కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
