హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో ఆ మూడు పెద్ద యాడ్ ఏజెన్సీల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని, ఆ ముగ్గురి కోసం చిన్న ఏజెన్సీల పొట్ట కొట్టొద్దని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) డిమాండ్ చేసింది. తమను ఆదుకునేలా కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీని తీసుకురావాలని కోరింది.
శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇఫ్తికార్, ప్రధాన కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. రూఫ్ టాప్ హోర్డింగ్‌లకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. జీవో నం. 68 రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వం కొత్త పాలసీని ఖరారు చేసే ముందు తమ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరపాలని, సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ నేతలు తిరుపతిరావు, మధు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
