TOXIC Review: ‘టాక్సిక్’ మూవీలో స్టయిల్ ఎక్కువ.. విషయం తక్కువ.. ఎక్కువగా ఊహించుకుంటే అంతే..!

TOXIC Review: ‘టాక్సిక్’ మూవీలో స్టయిల్ ఎక్కువ.. విషయం తక్కువ.. ఎక్కువగా ఊహించుకుంటే అంతే..!

‘KGF: 2’ తర్వాత యశ్ నటించిన చిత్రం ‘టాక్సిక్’ (TOXIC). ఇవాళ బుధవారం (ఆగస్టు 26, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించగా, తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్’ ఎలా ఉంది? ‘KGF 2’ తర్వాత యశ్ ఎలాంటి కథతో ప్రేక్షకులను అలరించాడు? సినిమా అంచనాలను అందుకుందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

‘టాక్సిక్’ కథేంటంటే:

‘టాక్సిక్’ కథ 1947 నాటి గోవా నేపథ్యంలో సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం, ప్రేమ, కుటుంబ బంధాలు, ద్రోహం, తండ్రీకొడుకుల మధ్య శత్రుత్వం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గోవాలో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ సాల్వడార్ తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. అతడి దగ్గర రాయా (యశ్), అతడి సోదరి గంగా (నయనతార) పనిచేస్తుంటారు. సాల్వడార్‌కు నమ్మకస్తులుగా ఉన్న వీరిద్దరూ గోవాలోని అక్రమ వ్యాపారాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అలా తన గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యాన్ని మరింత బలపరచుకోవడానికి సాల్వడార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. తన కుమార్తె రెబెక్కా (తారా సుతారియా)ను రాయాకు ఇచ్చి వివాహం చేస్తాడు. దీంతో రాయా కుటుంబం, సాల్వడార్ సామ్రాజ్యంలో మరింత కీలక వ్యక్తిగా మారతాడు.

నాదియాతో ప్రేమ.. ఊహించని మలుపు..

పెళ్లైనప్పటికీ రాయా జీవితంలోకి నాదియా (కియారా అద్వానీ) వస్తుంది. ఆమె ఒక సర్కస్ కళాకారిణి. నాదియాతో రాయా ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడటంతో వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బిడ్డే టికెట్‌, రుమీ (యశ్). అయితే రాయా, నాదియా జీవితాల్లో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. పరిస్థితులు వారిద్దరినీ విడిపోయేలా చేస్తాయి. దీంతో వారి కుమారుడు టికెట్‌ తన తల్లి నాదియా దగ్గరే పెరుగుతాడు. తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన టికెట్‌ జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కాలం గడిచేకొద్దీ అతడు కూడా తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు.

తండ్రీకొడుకుల మధ్య యుద్ధం..

ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. పరిస్థితులు పూర్తిగా మారిన తర్వాత రాయా తన సొంత కుమారుడైన టికెట్‌తోనే ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్రేమించిన తండ్రి, ఇప్పుడు తనకు ప్రాణ శత్రువుగా ఎందుకు మారాడు? రాయా–నాదియాల మధ్య అసలు ఏం జరిగింది? టికెట్‌ తన తండ్రికి ఎందుకు దూరమయ్యాడు? తండ్రీకొడుకులు చివరకు ఎందుకు పరస్పరం పోరాడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘టాక్సిక్’ అసలు కథ. 

స్టయిల్ ఉంది.. కానీ విషయం ఎక్కడ?

‘టాక్సిక్’లో భారీ యాక్షన్, స్టైలిష్ మేకింగ్, స్టార్ పవర్, అద్భుతమైన కెమెరా వర్క్ అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నింటినీ కలిపి నడిపించే బలమైన ఎమోషనల్ కథనం మాత్రం అంతగా కనిపించదు. సినిమాలోని కొన్ని ఫైట్స్ కథకు పెద్దగా అవసరం లేనట్టుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడం కంటే సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్, టోనల్ ఐడెంటిటీ ఇవ్వడానికే ఉపయోగించినట్టు అనిపిస్తాయి.

అయితే, ఇక్కడ మరో విషయం కూడా సినిమా బోరింగ్ ఫీల్ అవ్వడానికి కారణమైంది. 3 గంటల 14 నిమిషాల నిడివి, స్లోగా సాగే కథనం, అవసరానికి మించిన సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. భారీ తారాగణం ఉన్నప్పటికీ, చాలా పాత్రలకు బలమైన ఎమోషనల్ ఆర్క్ లేకపోవడం మరో లోపం కూడా. చివర్లో 
డైరెక్టర్ కథకు లోతైన అర్థం ఇవ్వాలన్న ప్రయత్నం చేసినా.. అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు.

ఇక మొత్తంగా ‘టాక్సిక్’లో స్టయిల్ ఉంది.. కానీ ఆ స్టయిల్‌కు తగ్గ విషయం లేదు. విజువల్స్, యాక్షన్ కోసం చూడొచ్చు.. కానీ ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్‌ను ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.