ToxicTheMovie: ‘టాక్సిక్’పై తప్పుడు ప్రచారానికి చెక్.. కోర్టు కీలక ఆదేశాలు

ToxicTheMovie: ‘టాక్సిక్’పై తప్పుడు ప్రచారానికి చెక్.. కోర్టు కీలక ఆదేశాలు

యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ ఎట్టకేలకు ఇవాళ (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాపై తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ బెంగళూరు కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ‘టాక్సిక్’ మేకర్స్‌కు ఊరటనిచ్చాయి. సినిమా ప్రీమియర్స్, విడుదలకు ముందే కోర్టు నుంచి అనుకూల తీర్పు రావడంతో చిత్ర బృందానికి మరింత బలం చేకూరినట్టైంది.

 ‘టాక్సిక్’పై తప్పుడు ప్రచారానికి చెక్..

చిత్ర నిర్మాణ సంస్థ KVN Productions LLP దాఖలు చేసిన పిటిషన్‌పై బెంగళూరులోని అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలు సినిమాపై తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని అడ్డుకుంటూ తాత్కాలిక ఏకపక్ష ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సాధారణంగా ‘జాన్ డో’ ఆర్డర్గా వ్యవహరిస్తారు. ప్రధానంగా తప్పుడు, హానికరమైన, పరువు నష్టం కలిగించే సమాచార వ్యాప్తిని నియంత్రించడమే ఈ ఉత్తర్వుల ఉద్దేశం. అయితే ఈ ఆదేశాలు సినిమాపై వచ్చే సాధారణ రివ్యూలు లేదా విమర్శలను నిషేధించేవి కావని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. 

(గాగ్ ఆర్డర్ అనగా.. బహిరంగంగా మాట్లాడటం, వార్తలు ప్రచురించడం లేదా సమాచారాన్ని బయటకు చెప్పకుండా ఇతరులను నిషేధిస్తారు)

థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

ఇక సినిమా విడుదలతో కర్ణాటకతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో యశ్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. పలుచోట్ల హౌస్‌ఫుల్ షోలు, థియేటర్ల వద్ద బాణసంచా కాల్చడం, డప్పులు, కేకలతో అభిమానులు సెలబ్రేట్ చేస్తున్నారు. యశ్ నాలుగేళ్ల తర్వాత థియేటర్లోకి రావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. 

‘టాక్సిక్’ పబ్లిక్ టాక్ ఏంటి?

ప్రస్తుతం ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్‌ టాక్ వస్తుంది. ముఖ్యంగా యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, స్టైలిష్ విజువల్స్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. నయనతార పాత్రకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో కథనం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విషయంలో కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల ‘కేజీఎఫ్’ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, కథనం ఆశించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

►ALSO READ | TOXIC: ‘A’ సర్టిఫికెట్ సినిమాలో హింస ఎక్కువైందంటూ రివ్యూలేంటి? ‘టాక్సిక్’ నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్

అంటే.. యశ్ యాక్షన్, స్వాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా.. మరోవైపు మితిమీరిన వయెలెన్స్, కథ, స్క్రీన్‌ప్లేపై మాత్రం నెటిజన్స్ నుంచి మిక్సెడ్ టాక్ వస్తోంది. అయితే, రానున్న రోజుల్లో మౌత్ టాక్ ఎలా మారుతుందో, బాక్సాఫీస్‌పై అది ఎలాంటి ప్రభావం చూపుతుందో.. అది మాత్రమే సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తమ చేస్తున్నారు. 

మొత్తానికి.. కోర్టు ఉత్తర్వులు, భారీ ఫ్యాన్ సెలబ్రేషన్స్, సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్‌తో ‘టాక్సిక్’ విడుదలైన రోజే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పుడు ఈ పబ్లిక్ టాక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.