బస్సు ఆపకుండా వెళ్లిండని.. డ్రైవర్​ను కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ

బస్సు ఆపకుండా వెళ్లిండని.. డ్రైవర్​ను కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ

జీడిమెట్ల, వెలుగు:  ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్​ను జీడిమెట్ల ట్రాఫిక్​ సీఐ కాలితో తన్నడంపై  తీవ్రంగా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి ట్రాఫిక్ కంట్రోలింగ్ లో భాగంగా జీడిమెట్ల సీఐ వెంకట్​రెడ్డి  ఓ ప్రైవేట్ ట్రావెల్ ​బస్సులోంచి డ్రైవర్​ను కిందకు దించి కాలుతో తన్నడంతో పాటు చెంపపై కొట్టాడు. అక్కడున్న ఓ వ్యక్తి సెల్​ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వైరల్ గా మారింది. డ్రైవర్ పై సీఐ ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. 

రూల్స్ ఉల్లంఘిస్తే చలానాలను వేయకుండా.. ఇష్టమొచ్చినట్టు కొట్టడడం ఏంటని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   బస్సును ఆపాలని తమ సిబ్బంది ప్రయత్నించగా డ్రైవర్​  ఆపకుండా వెళ్లాడని, ఐడీపీఎల్​ చౌరస్తాలో బస్సును ఆపి ప్రశ్నించామని ట్రాఫిక్​ సీఐ వెంకట్​రెడ్డి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమపై దాడికి యత్నించాడని,  అతడిని అడ్డుకునే క్రమంలోనే అలా చేయాల్సి వచ్చిందని సీఐ వివరణ ఇచ్చారు.