వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో రేపు (అక్టోబర్ 18) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో రేపు (అక్టోబర్ 18) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండగకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 18న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్‎పై ప్రభుత్వ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం (అక్టోబర్ 18) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. 

బతుకమ్మ వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సమాచారం కోసం హెల్ప్‌లైన్ 9010203626 సంప్రదించాలని చెప్పారు. 

ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రధాన మళ్లింపులు

  •  ఇక్బాల్ మినార్: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రారంభంలో కట్టమైసమ్మ, DBR మిల్స్, ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
  • ఖైరతాబాద్ (వీవీ విగ్రహం): ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ (ఇందిరా గాంధీ విగ్రహం) వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ రోడ్ వైపు దారి మళ్లిస్తారు.
  • లిబర్టీ జంక్షన్: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ యూ-టర్న్ వైపు మళ్లించి, తెలుగు తల్లి జంక్షన్ ద్వారా ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు.
  •  సికింద్రాబాద్ వైపు నుండి: అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్, కవాడిగూడ, గాంధీనగర్, ఇందిరా పార్క్, కట్టమైసమ్మ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు దారి మళ్లిస్తారు.
  •  నల్లగుంట జంక్షన్: బుద్ధ భవన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
  • ముషీరాబాద్ / కవాడిగూడ: చిల్డ్రన్స్ పార్క్, ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద ఇందిరా పార్క్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.