కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాద ఘటన జరిగింది. బతుకమ్మ ఆడుతున్న సమయంలో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్కు చెందిన శ్రీవాణి (25) స్పృహ తప్పి కిందపడింది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె మేనత్త ఇంటికి వచ్చింది.
వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కూడా పండుగ పూట ఇలాంటి విషాద ఘటనే జరిగింది. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో బతుకమ్మలు చెరువులో వేయబోయి నీటమునిగి ధర్మగళ్ళ స్వామి (35) అనే వ్యక్తి చనిపోయాడు.
వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. యాలాల్ (మం) లక్ష్మీ నారాయణపూర్ గ్రామంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం (28) దసరా పండుగ కోసం సెలవుల్లో ఇంటికి వచ్చాడు.
రోజంతా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన మల్లేశం రాత్రి బెడ్రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్న జవాన్ ఇలా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.
