కొందరికి కెరీర్ బిగినింగ్‌లోనే సక్సెస్ వస్తుంది. ఇంకొందరు ఎంత ప్రయత్నించినా అంత త్వరగా రాదు. కానీ, ఒక్కోసారి లైమ్ లైట్లోకి రాగానే ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది అంటారు. దాని వెనక వాళ్ల కష్టం, ఎంతోకాలం నుంచి పడిన ప్రయాస కనిపించవు. ఓవర్ నైట్ స్టార్ అని తేలిగ్గా అనేస్తుంటారు. అలాంటి వాళ్లను కదిలిస్తే.. వాళ్ల జర్నీలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, నేర్చుకున్న పాఠాలు, స్థిరంగా పనిచేస్తూ విజయ తీరాలకు చేరిన కథ తెలుస్తుంది. బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీది కూడా అలాంటి కథే.
చాలామంది నా సక్సెస్ ఓవర్‌నైట్‌లో వచ్చింది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది నా ఎనిమిదేండ్ల కష్టానికి ఫలితం. దానికంటే ముందు రెండేండ్లు ఆడిషన్స్, రిజెక్షన్స్తోనే నా లైఫ్ గడిచిపోయింది. అలాగని ఒక్క సినిమాతోనే పాపులారిటీ వచ్చింది అనుకునేవాళ్ల మీద నాకు కంప్లయింట్స్ ఏమీ లేవు.
త్రిప్తి డిమ్రీ ఉత్తరాఖండ్‌లోని చమోలీలో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు మీనాక్షి, దినేశ్ ప్రసాద్. త్రిప్తి తండ్రి ఎయిర్ ఇండియా ఉద్యోగి. ఆమెకు సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఢిల్లీలోని శ్రీ అరబిందో కాలేజీలో సైకాలజీ చేసింది. తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ నేర్చుకుంది. 2017లో ‘మామ్’, ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. 2018లో ‘లైలా మజ్ను’ సినిమాలో లీడ్ రోల్ చేసింది. అప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది.
కానీ, రీ రిలీజ్ చేశాక రికార్డ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత ‘బుల్బుల్’, ‘ఖాలా’ సినిమాల్లో నటించింది. 2023లో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో జోయా అనే పాత్ర చేసింది. అప్పటినుంచి ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. ‘బ్యాడ్ న్యూజ్’, ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’, ‘భూల్ భులైయా 3’, ‘దఢక్ 2’, ‘ఓ రోమియో’ వంటి వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది. ఈ కొత్త ఏడాదిలో మాధురీ దీక్షిత్ నటించిన ‘మా బెహెన్’ సినిమాలో కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా రిలీజ్ అయింది. త్రిప్తి జర్నీ విశేషాలు ఆమె మాటల్లో..
ఏది కరెక్ట్? ఏది రాంగ్?
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నాకు ‘ఇది వర్కవుట్ కాదు. తిరిగి వెనక్కి వెళ్లిపో’ అని చెప్పారు. కానీ నేను వచ్చిన పని జరగకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నా. కొత్తగా వచ్చినప్పుడు చాలా విషయాలు తెలియవు. కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఏది కరెక్ట్?
ఏది రాంగ్? అనేది కూడా తెలియదు కొన్నిసార్లు. ఒకరికి కరెక్ట్ అనిపించింది మరొకరికి రాంగ్ అనిపించొచ్చు. అప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ అవసరం అవుతుంది. అన్ని విషయాలను అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను నా వర్క్ షాప్స్‌లో బిజీ అయ్యాను. మెడిటేషన్ చేస్తూ కొత్త విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఒక దశలో ప్రతి రోజూ విపరీతంగా మెడిటేషన్ చేశాను. మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఆ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. చాలాసార్లు నాకు పనిలేకుండా ఖాళీగా ఉన్నాను. ఒక్క ఆడిషన్ కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి. అసలు నా లైఫ్‌లో ఏం జరుగుతుందో? అని ఆశ్చర్యపోయాను.
అందరిలానే..
ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరిలానే నేనూ ఆడిషన్స్ ఇచ్చాను. చాలావరకు సెలక్ట్ కాలేదు. రిజెక్షన్స్ ఫేస్ చేశాను. ఒక్కరోజే మూడు నాలుగు ఆడిషన్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏడాదిన్నర పాటు ఇదే నా డైలీ రొటీన్. కెమెరా ముందు నిల్చోవడానికి కంటే ముందు ఆడిషన్స్ ఫేస్ చేయడానికి నాకు చాలా భయమేసేది. ఎందుకంటే ఆడిషన్స్‌లో ఒకటి లేదా రెండు టేక్స్ మాత్రమే ఉంటాయి. ఎంతోమంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఒక క్యారెక్టర్లో లీనమై యాక్టింగ్ చేయడం నిజంగా సవాలే.
పైగా ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నటించాల్సి ఉంటుంది. ఎంతలా అంటే ఆ క్యారెక్టర్‌కి జీవంపోయాలి అంటారు కదా అలా. అప్పుడు ముందున్న దశ నుంచి బయటికి వచ్చేస్తాం. కానీ ఎప్పుడూ మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మనకు పని దొరికినప్పుడు, ఆ పనికి తాజాదనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆడియెన్స్‌కి ఆ పర్ఫార్మెన్స్ బోర్ కొట్టకుండా ఉంటుంది. అది ఇప్పుడు నాకు ఉన్న కొత్త చాలెంజ్. అయితే ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్లు బయట ఉన్నారు. వాళ్లకు ఈ అవకాశం రాలేదు. నాకు వచ్చినందుకు దాన్ని నేను దీవెనగా భావిస్తున్నాను.
