తమిళ రాజకీయాలు, సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని వెండితెరపై చూపించడం ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. ఇప్పుడు మరోసారి ఆమె పాత్ర చుట్టూ కోలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈసారి ఆ పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష కనిపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
జయలలితగా త్రిష?
దివంగత ముఖ్యమంత్రి, పురట్చితలైవర్ ఎంజీఆర్ జీవిత కథ ఆధారంగా 'పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్' పేరుతో బయోపిక్ తెరకెక్కించేందుకు నటుడు, దర్శక నిర్మాత జేఎం బషీర్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను ఆయనే పోషించనున్నారు. ఈ నెల 17 నుంచి రామనాథపురంలో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎంజీఆర్ సినీ ప్రయాణం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలు ఈ చిత్రంలో చూపించనున్నారు..
అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన జయలలిత పాత్ర కోసం హీరోయిన్ త్రిషను సంప్రదిస్తున్నట్లు జేఎం బషీర్ స్వయంగా వెల్లడించడం ఇప్పుడు కోలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తెకు త్రిష మంచి స్నేహితురాలని, ఆమె ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే త్రిష అంగీకరించారా? ఆమెనే ఖరారు చేశారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో కంగనా.. ఇప్పుడు త్రిష?
గతంలో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన 'తలైవి' చిత్రంలో కంగనా రనౌత్ జయలలితగా నటించారు. అలాగే వెబ్ సిరీస్లో రమ్యకృష్ణ కూడా ఆ పాత్రను పోషించారు. ఇప్పుడు త్రిషకు అవకాశం వస్తే, గత చిత్రాలతో పోలికలు రావడం ఖాయం. జయలలిత వ్యక్తిత్వం, హావభావాలు, రాజకీయ ప్రస్థానాన్ని ఎంత సహజంగా తెరపై ఆవిష్కరిస్తారనేది మరింత ఆసక్తికరంగా మారనుంది.
రాజకీయంగానూ..
ఎంజీఆర్తో జయలలితకు ఉన్న అనుబంధం, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వారి ప్రయాణం ఈ బయోపిక్కు ప్రధాన ఆకర్షణగా నిలవవచ్చు. అన్నాదురై, కరుణానిధి పాత్రలు కూడా ఉండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని బషీర్ తెలిపారు. అయితే, ఎంతో సున్నితమైన, సంచలనాత్మకమైన రాజకీయ నేపథ్యం ఉన్న జయలలిత రోల్లో నటించేందుకు త్రిష సాహసిస్తారా లేదా అనేది వేచి చూడాలి..
