ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, థియేట్రికల్ ఇష్యూస్ దాటుకుని, ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో సూర్య (Suriya), నటించిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' (తమిళంలో కరుప్పు - Karuppu) ఈరోజు ( మే 15, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివాదాల వల్ల ఆలస్యమైనా, ఫ్యాన్స్ భారీ అంచనాలతో థియేటర్లకు క్యూ కట్టారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో, సీనియర్ బ్యూటీ త్రిష (Trisha) హీరోయిన్‌గా వచ్చిన ఈ సోషియో-ఫాంటసీ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? సినీ ప్రియలను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథేంటంటే?
తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు (ఇంద్రన్స్) తన కూతురి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ సిటీకి రాగానే కొందరు దొంగలు వారి దగ్గరున్న నగలను దొంగిలిస్తారు. పోలీసులు దొంగలను పట్టుకున్నప్పటికీ, ఆ నగలను తిరిగి పొందాలంటే నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాల్సిందేనని చెబుతారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఆ తండ్రీకూతుళ్లకు బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే ఒక అవినీతి లాయర్ తారసపడతాడు. సహాయం చేయాల్సింది పోయి, వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాడు. పోలీస్, లీగల్ సిస్టమ్‌లోని అవినీతి పరాకాష్టకు చేరిన తరుణంలో.. ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి, బాధితులకు న్యాయం చేయడానికి సాక్షాత్తూ ఆ 'కరుప్పు' (వీరభద్రుడు) దేవుడు మనుష్య రూపంలో లాయర్ శరవణన్ (సూర్య) గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ!
ఎలా ఉందంటే?
ఇటీవలి కాలంలో సూర్యను ఇంత మాస్ అండ్ ఎనర్జిటిక్ రోల్‌లో చూడటం ఇదే మొదటిసారి. దైవత్వంతో కూడిన ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో సూర్య తన మేజిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. ఆయన లుక్, రౌద్రం, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటివి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు ఒక రేంజ్ ఊపు ఇస్తాయి.
దర్శకుడు ఆర్జే బాలాజీ పాత శంకర్, అట్లీ సినిమాల అవినీతి కాన్సెప్ట్‌నే తీసుకున్నప్పటికీ, దేవుడి శక్తులకు కొన్ని లిమిటేషన్స్ పెట్టి కథను ఇంట్రెస్టింగ్‌గా మార్చాడు. సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ కామెడీ సీన్స్, విజయ్ 'లియో' రిఫరెన్స్ సీన్, త్రిష ఎపిసోడ్స్ థియేటర్లలో బాగా నవ్విస్తాయి. జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ, రెడ్ చిల్లీస్ కలరింగ్ వర్క్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి.
మైనస్‌లు ఏంటంటే?
కథ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది, సూర్య ఎంట్రీ ఇంకాస్త ముందు పడాల్సింది అన్న టాక్ వినిపిస్తోంది. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే.. ఈ సినిమాకు చేసిన తెలుగు డబ్బింగ్ అస్సలు బాలేదు అన్న విమర్శలు మూటగట్టుకుంది. సూర్య వాయిస్ పవర్ తగ్గింది. అలాగే క్యారెక్టర్లు తమిళం కావడంతో ఎక్కువ తమిళ డైలాగులు వాడటం తెలుగు ఆడియన్స్‌కు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నా, పాటల మిక్సింగ్ బాలేకపోవడంతో లిరిక్స్ సరిగ్గా వినపడలేదన్న విమర్శలు వస్తున్నాయి..
'వీరభద్రుడు' వన్-మ్యాన్ షో! స్క్రిప్ట్ లోపాలు ఉన్నప్పటికీ సూర్య తన అల్టిమేట్ చరిష్మాతో సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడు. లాజిక్స్ పక్కన పెట్టి, కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్, సూర్య రాంపేజ్ కోసం ఈ వీకెండ్‌లో వన్-టైమ్ హ్యాపీగా వాచ్ చేయొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి పర్వాలేదు అన్న టాక్ వినిపిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.
