అమెరికాలో జాబ్స్ చేస్తున్న ఇండియన్స్‌కి షాక్.. 540 రోజుల ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు!

అమెరికాలో జాబ్స్ చేస్తున్న ఇండియన్స్‌కి షాక్.. 540 రోజుల ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు!

అమెరికాలో ఉంటూ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సమయంలో ఉద్యోగం కోల్పోకుండా రక్షణ కల్పిస్తున్న 540 రోజుల ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు రూల్ రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. గతంలో తాత్కాలికంగా అమలు చేసిన ఈ రూల్‌ను ఇప్పుడు శాశ్వతం చేస్తూ ఫైనల్ నిర్ణయం తీసుకుంది అమెరికా.

ఈ నిర్ణయం వల్ల హెచ్-4 వీసా కలిగిన జీవిత భాగస్వాములు, అసైలం కోరేవారు, శరణార్థులు, వివిధ రకాల ఇమ్మిగ్రెంట్లు తీవ్రంగా నష్టపోనున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన భారతీయులు ఈ ఈఏడీ పర్మిట్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెన్యువల్ రాకముందే పర్మిట్ గడువు ముగిస్తే.. వారు చట్టబద్ధంగా ఉద్యోగం చేయడానికి వీలు ఉండదు. అయితే F-1 స్టెమ్ విద్యార్థులకు మాత్రం 180 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై మాజీ వైట్‌హౌస్ సలహాదారు, ఇమ్మిగ్రేషన్ అటార్నీ అజయ్ జైన్ భూటోరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్టబద్ధంగా జీవిస్తున్న వలసదారులు, హెచ్-4 స్పౌస్‌లు, ఆరోగ్య రంగ నిపుణులపై పడిన పెనుభారమని మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న దరఖాస్తులు సకాలంలో ప్రాసెస్ కాకపోతే వేలాది కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనికి తోడు.. హెచ్-1బీ వీసా పొడిగింపుల సమీక్షలో గతంలో ఇచ్చిన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వబోమంటూ ట్రంప్ ప్రభుత్వం మరో ప్రతిపాదన తెచ్చింది. ఇది అమలైతే దరఖాస్తుదారులకు మరింత కాలయాపన, డాక్యుమెంటేషన్ భారం పెరుగుతుంది. నవంబర్ 13 వరకు ఈ ప్రతిపాదనపై పబ్లిక్ కామెంట్స్ కోరారు. ఏది ఏమైనప్పటికీ.. మారుతున్న ఈ నిబంధనల వల్ల విదేశీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని తెలుస్తోంది.