వలసలే ఫ్రాన్స్‎లో అల్లర్లకు కారణం.. తక్షణమే బోర్డర్స్ క్లోజ్ చేయండి: ట్రంప్

వలసలే ఫ్రాన్స్‎లో అల్లర్లకు కారణం.. తక్షణమే బోర్డర్స్ క్లోజ్ చేయండి: ట్రంప్

వాషింగ్టన్: ఫ్రాన్స్‎లో తీవ్రరూపం దాల్చిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‎లో నిరసనలు, అల్లర్లకు అనియంత్రిత వలసలే కారణమని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చిన వలసదారులు తమ హృదయాల్లో ద్వేషాన్ని నింపుకుని ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రాన్స్ తక్షణమే తన సరిహద్దులను మూసివేసి వలసలను అదుపు చేయాలని సూచించారు.

విద్యార్థుల ఆందోళనతో మొదలై.. దేశవ్యాప్త ఉద్యమంగా

నిరసనలు, అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడికిపోతుంది. దేశంలో నిత్యవసరాల పెరుగుదల, పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడం, విద్యా సదుపాయాల కొరత వంటి సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఒక ప్రాంతంలో ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. జీవన వ్యయాలు పెరగడం, ప్రజా సేవల నాణ్యత తగ్గడం, ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తితో కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఉద్యమంలో చేరాయి.

పారిస్‏లో ప్రధాన ర్యాలీ ప్రశాంతంగానే సాగింది. కానీ పలుచోట్ల నిరసనకారులు ఆగ్రహానికి గురికావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు వీధుల్లో నిప్పు పెట్టడంతో పాటు వాహనాలను, ప్రభుత్వ భవనాలను తగులబెట్టారు. ప్రముఖ ప్రాంతమైన ప్లాస్ ద లా రిపబ్లిక్ సమీపంలోనూ వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు నిరసనకారులపైకి దూసుకెళ్లి లాఠీలతో కొడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

నిరసనలకు కారణం వలసలు కాదు

ఫ్రాన్స్‎లో అంతర్గత నిరసలు, అల్లర్లకు వలసలే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదే పదే చెబుతున్నారు. కానీ అల్లర్లపై ఫ్రాన్స్ ప్రభుత్వం, నిరసనకారుల వాదన మరోలా ఉంది. దేశంలో అల్లర్లకు వలసలు కారణం కాదని.. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఆర్థిక ఇబ్బందులు, నిత్యవసరాల పెరుగుదలే కారణమని ప్రభుత్వం, నిరసనకారులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న నిరసనలకు వలసలతో లేదా మరే ఇతర మతపరమైన అంశాలతో సంబంధం లేదని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది.