ట్రంప్ నా భర్త.. నోరు జారిన సెక్రటరీపై వేటు.. ఐదు రోజులకే పదవి నుంచి ఔట్

ట్రంప్ నా భర్త.. నోరు జారిన సెక్రటరీపై వేటు.. ఐదు రోజులకే పదవి నుంచి ఔట్

ట్రంప్ నా అధ్యక్షుడు.. నా భర్త.. అంటూ నోరు జారిన వైట్ హౌస్ సెక్రటరీ కేటీ జకారియాపై వేటుపడింది.  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన కేవలం ఐదు రోజులకే ఆమె పదవి ఊడింది. ఆమె పనితీరుపై విమర్శలు రావడంతో పాటు, న్యాయవాదిగా ఆమెకున్న అర్హతలపై ప్రశ్నలు తలెత్తడంతో ఆమెకు ఉధ్వాసన పలికారు.  వైట్‌హౌస్ అధికారులు ఆమె పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 

 తొలి బ్రీఫింగ్‌తోనే విమర్శలు

కేటీ జకారియా 2026 అక్టోబర్ 12న (సోమవారం) ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తొలిసారి వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశం కేవలం 14 నిమిషాలకే ముగిసింది. ఆమె ముగ్గురు విలేకరుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ పాలన, ఆయన సాధించిన విజయాల గురించి మాట్లాడిన తీరు, విలేకరుల ప్రశ్నలను ఎదుర్కొన్న విధానంపై విమర్శలు వచ్చాయి.  

 న్యాయవాదిగా అర్హతలపై వివాదం

కేటీ జకారియా కాలిఫోర్నియాలోని పెప్పర్‌డైన్ యూనివర్సిటీ లా స్కూల్‌లో చదువుకున్నారు. గతంలో తాను న్యాయవాదిగా పనిచేసినట్లు ఆమె చెప్పడంతో, ఆమె అర్హతలపై చర్చ మొదలైంది. అమెరికాలో న్యాయవాదిగా పనిచేయాలంటే సంబంధిత రాష్ట్ర బార్ లో ఉత్తీర్ణత సాధించి, న్యాయవాదిగా నమోదు కావాలి.

అయితే తాను బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని జకారియా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమె న్యాయవాదిగా పనిచేసినట్లు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదమే  ఆమె పదవికి ఎసరు పెట్టేలా మారింది.

 జకారియా తప్పుకోవడంతో ట్రంప్ ప్రభుత్వానికి ప్రస్తుతం కీలకమైన మీడియా ప్రతినిధి లేకుండా పోయారు. నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనుండటం గమనార్హం. కొత్త ప్రెస్ సెక్రటరీని నియమించడానికి తాను తొందరపడటం లేదని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు.