- బర్త్ టూరిజం కేసుల్లో 4 వేలకు పైగా రద్దు
- సోషల్ మీడియా ఖాతాలపైనా నిఘా
- వర్క్ వీసాలపై అదనపు రుసుములు
- విద్యార్థులు, విదేశీ నిపుణులపై ఎఫెక్ట్
- భావ ప్రకటన స్వేచ్ఛకు
- భంగమంటున్న హక్కుల సంఘాలు
- చట్టాలు అతిక్రమించిన వాళ్లే టార్గెట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అమెరికా చరిత్రలోనే అత్యంత వేగంగా, అత్యధిక సంఖ్యలో వీసాలను రద్దు చేసిన ప్రభుత్వంగా తమ పరిపాలన నిలిచిందని ట్రంప్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
అమెరికా చట్టాలను, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇలా రద్దు చేసిన వీసాలలో దాదాపు 4,000కు పైగా వీసాలు ‘బర్త్ టూరిజం’ (అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందడానికి వచ్చేవారు) సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారివే ఉన్నాయని వెల్లడించారు. దేశ సరిహద్దుల భద్రత, జాతీయ భద్రతను కాపాడటానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా తనిఖీలు..
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వీసా జారీ ప్రక్రియను, స్క్రీనింగ్ నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. దరఖాస్తుదారుల పూర్వాపరాలతో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ రకమైన చర్యలపై మానవ హక్కుల సంఘాలు, వామపక్ష విమర్శకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
చట్టబద్ధమైన వలసలపై ప్రభావం
అక్రమ వలసలను అరికట్టడమే కాకుండా, విదేశీ కార్మికులు, విద్యార్థులు ఉపయోగించే చట్టబద్ధమైన వీసాలపై కూడా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్క్ వీసాలపై అదనపు రుసుములు విధించడం, అదనపు తనిఖీలు చేపట్టడం వల్ల అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులు, విద్యార్థుల సంఖ్యపై ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ, రాబోయే రోజుల్లోనూ ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినంగా అమలుచేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
