ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా..? ట్రంప్ ఒక్క మాటతో మిడిల్ ఈస్ట్‎లో టెన్షన్ టెన్షన్

ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా..? ట్రంప్ ఒక్క మాటతో మిడిల్ ఈస్ట్‎లో టెన్షన్ టెన్షన్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలు కానుందా..? కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్ మళ్లీ రణరంగంగా మారనుందా..? తమ మాట లెక్క చేయని ఇరాన్‎పై అమెరికా మళ్లీ దాడి చేయనుందా..? అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు వింటే ఔను అనే అనిపిస్తోంది. ఇరాన్‎పై మళ్లీ దాడులు చేయడంపై తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‏పై ఆదివారం (అక్టోబర్ 25) నుంచి దాడులు పునఃప్రారంభించవచ్చని కామెంట్ చేశారు. అదే సమయంలో.. ఇరాన్‌తో ఒక పెద్ద, అందమైన ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ట్రంప్ డబుల్ గేమ్‎తో అసలు ఏం జరగబోతుందని ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. 

అమెరికా మధ్యంతర ఎన్నికలలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం (అక్టోబర్ 24) ట్రంప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరాన్‎పై మళ్లీ దాడులు చేస్తారా అని మీడియా ట్రంప్‎ను ప్రశ్నించగా.. ఆదివారం (అక్టోబర్ 25) నుంచి ఇరాన్‎పై దాడులు పునఃప్రారంభించవచ్చని అన్నారు. అలాగే, ఇరాన్‎తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం కూడా లేకపోలేదని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఇరాన్‎పై దాడులు చేయాలని ప్లాన్ చేసినా ముందే ఆ విషయం నేను మీకు నిజంగా చెబుతానని నమ్ముతున్నారా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఓ వైపు దాడులు మళ్లీ ప్రారంభిస్తామని చెబుతూనే.. మరోవైపు శాంతి ఒప్పందం కుదిరే ఛాన్స్ కూడా ఉందన్న ట్రంప్ తికమక మాటలతో గందరగోళం నెలకొంది. 

నిప్పుతో చెలగాటం వద్దు.. ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. అమెరికా 'నిప్పుతో చెలగాటమాడకూడదు' అని వార్నింగ్ ఇచ్చింది. తమపై మళ్లీ దాడి జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ప్రకటించింది. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలను దీర్ఘకాలం స్తంభింపజేస్తామని తెలిపింది. “ఇరాన్పై దాడి జరిగితే ఇక ఎలాంటి సరిహద్దులు, రెడ్ లైన్స్ ఉండవు.. సైనిక స్థావరాల నుంచి కేబుల్స్ దాకా దేన్నీ వదలం" అని ఇరాన్ అధికారి ఒకరు హెచ్చరించారు.