ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైతే, ఇరాన్‌పై తిరిగి దాడులు చేస్తామన్నారు. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని టర్కీలో అమెరికా రాయబారి టామ్ బారక్, పేర్కొన్న కొన్ని గంటలకే ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఫ్లోరిడాలో మధ్యంతర ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ తో శాంతి చర్చలను ప్రస్తావించారు. ఇరాన్ శాంతిఒప్పందం చేసుకుంటే సరే.. లేదంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తప్పదు అని హెచ్చరించారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అనేది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా ప్రారంభించిన సైనిక చర్య.
మిడిల్ ఈస్ట్ లో యుద్దం కారణంగా చమురు సరఫరాపై ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు సతమతమవుతున్న క్రమంలో ఇరాన్ తో శాంతి చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు ఉద్రిక్తతను ఆజ్యం పోస్తున్నాయి. ఉక్రెయిన్ రిఫైనరీలపై రష్యా దాడుల వల్లే చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ట్రంప్ వాదిస్తున్నప్పటికీ మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఘర్షణవల్లే ప్రపంచ చమురు సరఫరా చైన్ దెబ్బతిని ముడి చమురు ధరలు పెరగడానికి కారణమైన క్రమంలో కొత్త దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. అయితే రెచ్చగొడితే ఎదురుదాడికి సిద్దంగా ఉన్నామని ఇరాన్ తెలిపింది.
మరోవైపు క్యూబాకు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో రహస్య భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని క్యూబాపై అమెరికా వత్తిడి తెస్తున్న క్రమంలో ట్రంప్ తాజా ప్రకటన చర్చనీయాంశమైంది. ‘‘ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు క్యూబా సంగతి చూస్తాం. ఆ అందమైన ఓడలు క్యూబా మీదుగా వెళ్తాయి. వాటిలో ఒకదాన్ని తీరానికి సుమారు 50 గజాల దూరంలో ఆపుతాం. వాళ్లు తమ చేతులు పైకెత్తుతారు, ఆ తర్వాత మేము మార్కో రూబియోను లోపలికి పంపుతామని’’ ట్రంప్ అనడం త్వరలో క్యూబాపై కూడా అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ట్రంప్ హెచ్చరికను క్యూబా తిరస్కరించింది.
