అమెరికాలో గ్రీన్ కార్డ్ తెచ్చుకుని సెటిల్ అయిపోదాం అనుకునే ఇండియన్స్‌కి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది. అమెరికా తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం.. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేయడం కుదరదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, మిగిలిన వారంతా అమెరికా వదిలి సొంత దేశానికి వెళ్లి అక్కడి యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. దీనివల్ల ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న H-1B, L-1, F-1 వీసా హోల్డర్లకి తిప్పలు తప్పేలా లేవు.
అయితే ఈ కొత్త పాలసీ కేవలం వీసాలకే పరిమితం కాలేదు, భారత్‌కు తిరిగి వచ్చే ఎన్ఆర్ఐలపై ఇది తీవ్రమైన ఆర్థిక, ట్యాక్స్ ప్రభావం చూపించబోతోంది. ట్రంప్ కొత్త గ్రీన్ కార్డ్ పాలసీతో అసలు భారతీయ ఎన్ఆర్ఐ ఫ్యామిలీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. గ్లోబల్ ఇన్‌కమ్‌పై ట్యాక్స్ బాదుడు:
భారత్‌లో ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి ఏడాదిలో ఉండే రోజులను బట్టి 'రెసిడెంట్' హోదా ఇస్తారు. గత 5 ఏళ్లలో ఇండియా వదిలి వెళ్లిన వాళ్లు ఇప్పుడు తిరిగి వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే.. వారు 'రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్' కేటగిరీ కిందకి వచ్చేస్తారు. అలా కనుక వస్తే.. వారు అమెరికాలో సంపాదించే ఇన్‌కమ్‌పై కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ టెంపరరీగా 'RNOR' స్టేటస్ దొరికితే మాత్రం కొంతకాలం పాటు కేవలం ఇండియాలో వచ్చే ఆదాయానికే ట్యాక్స్ కట్టే వెసులుబాటు ఉంటుంది.
2. వర్క్ ఫ్రమ్ ఇండియా.. జీతంపై డబుల్ ట్యాక్స్:
చాలామంది అమెరికా కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ.. ఇండియా నుండి రిమోట్‌గా వర్క్ చేస్తుంటారు. జీతం యూఎస్ బ్యాంక్ అకౌంట్‌లోనే పడినా.. వారు శారీరకంగా ఇండియాలో ఉండి పని చేస్తున్నారు కాబట్టి ఆ శాలరీని 'ఇండియా సోర్స్ ఇన్‌కమ్' గానే పరిగణిస్తారు. దీనివల్ల ఆ జీతంపై ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే ఇండియా-యూఎస్ మధ్య ఉన్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ద్వారా కొంతవరకు ట్యాక్స్ క్రెడిట్ లభించినా.. ఆ ప్రాసెస్ చాలా తలనొప్పిగా ఉంటుంది.
3. ఆస్తులు దాస్తే.. రూ. 10 లక్షల పెనాల్టీ:
ఇండియా తిరిగొచ్చే ఎన్ఆర్ఐలకి అమెరికాలో ఉన్న 401(k), IRAs లాంటి రిటైర్మెంట్ అకౌంట్లు, స్టాక్స్, ఇళ్లు.. ఇవన్నీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు 'ఫారిన్ అసెట్స్' కింద చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని చూపించడం మర్చిపోయినా లేదా తప్పుగా రిపోర్ట్ చేసినా రూ.10 లక్షల భారీ పెనాల్టీ పడుతుంది.
4. గ్రీన్ కార్డ్ వచ్చినా వదలని ట్యాక్స్ భయం:
కష్టపడి కాన్సులర్ ప్రాసెస్ పూర్తి చేసి గ్రీన్ కార్డ్ సంపాదించినా సరే ట్యాక్స్ ఇబ్బందులు ముగిసిపోవు. గ్రీన్ కార్డ్ హోల్డర్లను అమెరికా ఎప్పుడూ తమ దేశ ట్యాక్స్ రెసిడెంట్స్‌గానే చూస్తుంది. అటు అమెరికా గ్లోబల్ ఇన్‌కమ్‌పై ట్యాక్స్ అడుగుతుంది, ఇటు ఇండియా (ROR హోదా వస్తే) ట్యాక్స్ కట్టా్ల్సిందే అంటుంది. సో దీంతో రెండు దేశాల్లోనూ FBAR, 8938, ఫామ్ 44 లాంటి లెక్కలేనన్ని ఫారాలు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎన్ఆర్ఐలు.
అంతేకాదు ఇండియా వచ్చేటప్పుడు యూఎస్ బ్రోకర్లకు 'Form W-8 BEN' సబ్మిట్ చేయకపోతే.. వారు మిమ్మల్ని యూఎస్ రెసిడెంట్‌గానే భావించి తప్పుడు ట్యాక్స్ రిపోర్టింగ్ ఇస్తారు. దీనివల్ల నేరుగా అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. మొత్తానికి ట్రంప్ కొత్త పాలసీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌ని కఠినం చేయడమే కాకుండా.. ఎన్ఆర్ఐల పర్సనల్ ఫైనాన్స్‌ని కూడా పూర్తిగా ఇబ్బందులకు గురిచేయనుందని తెలుస్తోంది.
