న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ జీవితంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతంలో కామెంట్లు చేసిన వీడియో ఒకటి తాజాగా ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌తో కలిసి వైట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మోదీ గొప్ప వ్యక్తి. ఆయనకు నాపై ప్రేమ ఉంది.
ఈ ప్రేమ అనే పదాన్ని వేరేలా అర్థం చేసుకోవద్దు. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని నేను కోరుకోవడంలేదు. ఇండియాను నేను చాలా ఏండ్లుగా గమనిస్తున్నా. అక్కడ చాలాకాలంగా నా ఫ్రెండ్ ఉన్నారు”అని కామెంట్లు చేశారు.
తాజాగా ఈ వీడియో వైరల్ అయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన నేపథ్యంలో దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మీడియా సమావేశంలో స్పందించారు.
ఈ వీడియోను తాను చూడలేదని, ఈ వీడియో నిజమైనదైనా లేదా ఎవరైనా కావాలనే ఫేక్ వీడియో తయారు చేసినా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
