వాటర్ ఎమర్జెన్సీ ముంగిట మానవాళి!

వాటర్ ఎమర్జెన్సీ  ముంగిట మానవాళి!

నీటిచుక్కను కాపాడుకోవడమన్నది ఇకనుంచి మన బాధ్యత గా మారబోతున్నదా!  నల్లని మబ్బులు కమ్ముకుని ఆకాశం నుంచి నీటిధార జాలువారుతుందని ఆశగా ఎదురుచూసిన కళ్లలో ఎండమావుల నీడలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు  నీటితో  నిండిన చెరువుల కళకళ,  పొంగిన నదులలో జలకళ తెలంగాణ నేలలో ఇక కనుమరుగు కానున్నదా?  నీటిచుక్క కోసం ఆందోళన మొదలవుతోందా?  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వంటి మహానగరాలు కాంక్రీట్‌‌‌‌‌‌‌‌ జంగిల్స్‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయి.  

భూ గర్భంలోకి వర్షపునీరు ఇంకేందుకు అవకాశం లేకుండా నగర ఉపరితలం సిమెంట్‌‌‌‌‌‌‌‌, కాంక్రీట్‌‌‌‌‌‌‌‌తో కప్పుకుపోతోంది. ఒకవైపు వర్షపాతం తీరుతెన్నులు మారుతున్నాయి.  మరోవైపు ఉన్న నీటిని మనమే విచ్చలవిడిగా వినియోగిస్తున్నాం. దీని ఫలితమే జలాశయాలు అడుగంటడం,  భూగర్భజలస్థాయి పడిపోవడం, బోరు బావులు ఎండిపోవడం.  ఈ నేపథ్యంలో తరచూ వినిపిస్తున్న ఒక హెచ్చరిక  ‘వాటర్ ఎమర్జెన్సీ’.    
 
వాటర్ ఎమర్జెన్సీ వస్తే మన జీవితం ఎలా మారుతుంది?  ప్రపంచంలోని కొన్ని నగరాలు ఎదుర్కొన్న అనుభవాలు మనకు ఏం చెబుతున్నాయి?  ముఖ్యంగా ఆ పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ ఉద్దేశం.  ప్రజలను భయపెట్టడం కాదు. ముందుగానే  మేల్కొలపడం ఈ రచయిత లక్ష్యం. 

వాటర్ ఎమర్జెన్సీ అంటే ఏమిటి?

ఒక ప్రాంతంలో ప్రజల కనీస అవసరాలకు.. అంటే  తాగడానికి, వంటకు, పారిశుద్ధ్యానికి ఇంకా అతి ముఖ్య పనులు కోసం అవసరమైన నీటిని కూడా సమృద్ధిగా అందించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు  ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాల్సి వస్తుంది.  ఇలాంటి పరిస్థితినే సాధారణంగా ‘వాటర్ ఎమర్జెన్సీ’గా వ్యవహరిస్తారు. ఇది కేవలం నీటి కొరత కాదు.  నీటి కోసం మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి.  

ఇలాంటి  సంక్షోభంలో కుటుంబాలకు పరిమిత  నీటి సరఫరా, నీటి వినియోగంపై  నియంత్రణ,  స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌ పూల్స్‌‌‌‌‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌ పార్కులు, కార్‌‌‌‌‌‌‌‌ వాషింగ్‌‌‌‌‌‌‌‌,  నిరుపయోగ గార్డెనింగ్‌‌‌‌‌‌‌‌ వంటి వాటిలో నీటి వినియోగాలపై  ఆంక్షలు విధించే పరిస్థితి రావచ్చు.  నీటివృథాపై  జరిమానాలు కూడా విధించవచ్చు.  అంటే  మనకు  కావాల్సినంత నీరు దొరికే రోజులుపోయి, మనకు కేటాయించినంత నీటితోనే జీవించాల్సిన రోజు వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

‘డే జీరో’ హెచ్చరిక

2018లో దక్షిణాఫ్రికాలోని కేప్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆ నగరంలోని నీటివనరులు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దానినే  డే జీరోగా పిలిచారు.  ప్రజల నీటి వినియోగంపై కఠిన పరిమితులు విధించాల్సి వచ్చింది. ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు ఎంత నీరు సరిపోతుందో ప్రజలు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  మన దేశంలోనూ చెన్నై నగరం 2019లో తీవ్ర నీటి  సంక్షోభాన్ని ఎదుర్కొంది.  నీటికోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చింది. 2024లో  బెంగళూరు కూడా నీటి కొరత తీవ్రతను చవిచూసింది. అనేక అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో నీటి వినియోగాన్ని పరిమితం చేయాల్సి వచ్చింది. ఇవి కేవలం ఈ నగరాల కథలు కావు. నీటిని నిర్లక్ష్యం చేస్తే ఏ నగరానికైనా ఇదే పరిస్థితి రావచ్చు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నేర్చుకోవాల్సిన పాఠం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మహానగరం గతంలోనూ తీవ్రమైన నీటి ఎద్దడిని చూసింది. 2016లో సింగూరు, మంజీరా వంటి ప్రధాన జల వనరుల్లో నీటి నిల్వలు ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో నగరంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాతావరణ మార్పులు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు, పెరుగుతున్న జనాభా, భూగర్భజలాల అధిక వినియోగం ఇవన్నీ కలిసి భవిష్యత్తుపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. అందుకే ‘వాటర్ ఎమర్జెన్సీ వస్తుందా?’ అనే ప్రశ్నకంటే.. ‘అది రాకుండా మనం ఏం చేస్తున్నాం?’ అనేదే  ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. 

 వర్షపాతం తగ్గడానికి వాతావరణ వ్యవస్థల్లో వచ్చే మార్పులు ఒక కారణం కావచ్చు.  ఎల్‌‌‌‌‌‌‌‌నినో వంటి సముద్ర -వాతావరణ పరిణామాలు  ప్రపంచంలోని అనేక ప్రాంతాల వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపగలవు.  కానీ నీటి సంక్షోభానికి మొత్తం బాధ్యతను ఒక్క వాతావరణ పరిణామంపై మోపడం సరికాదు.  వర్షం ఎంత పడింది అన్నదాని కంటే, పడిన నీటిలో ఎంత భూమిలోకి ఇంకింది?  మనం ఎంత నిల్వ చేసుకున్నాం? ఎంత వృథా చేశాం? ఎంత బాధ్యతగా ఉపయోగించాం? ఈ ప్రశ్నలే కీలకం. వాతావరణం మన చేతుల్లో లేదు. కానీ నీటి వినియోగం మాత్రం కొంతవరకు మన చేతుల్లోనే ఉంది.

ఇంటి నుంచే జల సంరక్షణకు శ్రీకారం

ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించాలి. జలాశయాలను కాపాడాలి.  వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ బాధ్యత.  కానీ  ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రభుత్వ ప్రయత్నమూ సంపూర్ణం కాదు.  ప్రజలు కూడా నీటిని పొదుపుచేసి  తమవంతు సహకారాన్ని అందించాలి.   నిత్యావసరాలకు  నీటిని ఉపయోగిస్తున్నప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు అవసరం లేనప్పుడు నల్లా తెరిచి ఉంచకూడదు. నల్లా నుంచి వృథాగా పారేది కేవలం నీరు కాదు. మన భవిష్యత్తు కూడా!  

అవసరానికి మించి నీటిని వినియోగించే అలవాట్లను పూర్తిగా తగ్గించాలి.  సాధ్యమైన చోట బకెట్‌‌‌‌‌‌‌‌తో స్నానం చేయడం వంటి చిన్న మార్పులు కూడా పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేయగలవు.  లీకేజీ అంటే చిన్న సమస్య కాదు.  ఇంట్లో కారుతున్న నల్లా,  పైపు కనిపిస్తే వెంటనే మరమ్మతు చేయాలి. ‘కొద్దిపాటి నీరు మాత్రమే కారుతోంది’ అని వదిలేయడం చివరకు వేల లీటర్ల నీటి నష్టానికి దారితీయవచ్చు. 

వాడిన నీటిని మళ్లీ వాడుకునే ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలి.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ  ప్యూరిఫైయర్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే నీటిని పారబోయకుండా ఆ నీటిని ఇంటి ఫ్లోర్ క్లీన్ చేయడానికి లేదా ఇతర అనుకూల అవసరాలకు ఉపయోగించవచ్చు. కూరగాయలు, బియ్యం కడిగిన నీటిని కూడా తగిన విధంగా మొక్కలకు ఉపయోగించవచ్చు. ఒకసారి వాడిన నీటిని రెండో సారి వాడగలగడమూ జల సంరక్షణే!

భూగర్భజలాలను సంరక్షించాలి

నగరాల్లో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం.  ప్రతి ఇల్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, కార్యాలయం, సంస్థ తమ పరిధిలో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి. రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ హార్వెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఒక అలంకారం కాదు.  భవిష్యత్తుకు బీమా.  ఇంటి ప్రాంగణాలను పూర్తిగా కాంక్రీట్‌‌‌‌‌‌‌‌తో  కప్పేయకుండా వీలైనంత మేరకు మట్టి ఉపరితలాన్ని ఉంచాలి.  చెరువులు, కుంటలు, వాగులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాలి.  

అందుకే మన పూర్వీకులు అనేవారు.. చెరువు బతికితే , ఊరు బతుకుతుందని.  నీటి కోసం యుద్ధం వద్దు.  నీటి కోసం ఉద్యమం కావాలి!  నీటి కొరతను కేవలం ప్రభుత్వ వైఫల్యంగా చూడటం సరిపోదు. అదే సమయంలో  మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కూడా సరికాదు.  ఇది ప్రభుత్వం,  ప్రజలు కలిసి పరిష్కరించాల్సిన సమస్య.  ప్రభుత్వాలు దీర్ఘకాలిక జల విధానాలు రూపొందించాలి. చెరువులు, నదులు, జలాశయాలను రక్షించాలి. 

వర్షపునీటి సంరక్షణను సమర్థంగా అమలు చేయాలి

వర్షపునీటి  సంరక్షణను  ప్రభుత్వం  సమర్థంగా అమలు చేయాలి.  భూగర్భజలాల  వినియోగంపై శాస్త్రీయ నియంత్రణ అవసరం.  ప్రజలు మాత్రం తమ ఇంటి నుంచి మార్పు ప్రారంభించాలి.  ఎందుకంటే నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెద్ద పెద్ద నినాదాల కంటే చిన్న చిన్న అలవాట్ల మార్పులే శక్తిమంతమైన ఆయుధాలు. ‘వాటర్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీ’ అనేది  భయపెట్టడానికి కాదు. మనల్ని మేల్కొల్పడానికి.   రేపటి తరం  నీటికోసం బిందెలతో కిలోమీటర్ల దూరం  నడవకూడదు. మన నగరాలు ట్యాంకర్ల కోసం ఎదురు చూడకూడదు.  నీటికోసం కుటుంబాలు, సమాజాలు, ప్రాంతాలు ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు.  

అందుకే మనకోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం ఈరోజే ఒక నిర్ణయం తీసుకుందాం.  ‘నీటిని వృథా చేయం.  వర్షపు నీటిని వృథాగా పోనివ్వం,  చెరువులను కాపాడతాం.  భూగర్భజలాలను సంరక్షిస్తాం’ అని ప్రతిజ్ఞ చేయాలి.  ప్రతి నీటిచుక్కలో ఒక జీవితం ఉంది.  ప్రతి చెరువులో ఒక భవిష్యత్తు ఉంది.  ప్రతి వర్షపు చినుకులో ఒక ఆశ ఉంది.  అందుకే నీటిని  పొదుపు చేద్దాం.  జలాన్ని రక్షిద్దాం. రాబోయే తరాలకు జలకళలాడే  పచ్చని భూమిని అందిద్దాం! 

- తుర్లపాటి నాగభూషణ రావు
పర్యావరణ రచయిత

ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు 'వెలుగు' కుమాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.