తమిళ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె డ్రైవర్ ముత్తుగణేశ్ (38) మృతి చెందగా, నటి సురక్షితంగా బయటపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు రన్నింగ్ టైంలోనే టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ వెంటనే డ్రైవర్ ముత్తు గణేష్ రోడ్డుపక్కన కారు ఆపి టైరు మార్చుతున్నాడు. ఆ సమయంలో, వేగంగా వచ్చిన మరో కారు అదుపు తప్పి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ముత్తు గణేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో నటి దేవి ప్రియకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె కారు పక్కన నిలబడి ఉండటంతో తృటిలో తప్పించుకున్నారు. అయితే, ఈ ప్రమాదంలో దేవి ప్రియ పర్సనల్ అసిస్టెంట్ దివాకర్ (36) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం పెరంబలూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముత్తుగణేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దేవి ప్రియా తమిళ టెలివిజన్ రంగంలో పాపులర్ నటిగా రాణిస్తున్నారు. ఆమె లక్ష్మి, రోమాపురి పాండియన్, ఎన్ తోజి ఎన్ కాధలి ఎన్ మనైవి, సెల్వి, తేకతి పొన్ను వంటి పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందారు.
