తమిళనాడులో సంచలనం. నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య విడాకుల పిటీషన్ దాఖలు చేసింది. చెన్నై సిటీలోని చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో.. విడాకుల పిటీషన్ ఫైల్ చేసింది విజయ్ భార్య సంగీత. పిటీషన్ ను విచారించిన కోర్టు.. ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు పంపింది.
2026, ఫిబ్రవరి 27వ తేదీ విజయ్ భార్య సంగీత ఈ పిటీషన్ దాఖలు చేసినట్లు తమిళనాడు వర్గాల సమాచారం. కొన్నాళ్లుగా వీళ్లిద్దరి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న విజయ్కు విడాకుల వివాదం తలనొప్పి వ్యవహారంగా మారనుంది.
టీవీకే.. తమిళ వెట్రిగల్ కజగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు విజయ్. తన లాస్ట్ సినిమా జన నాయకన్ అని ప్రకటించారు. సెన్సార్ వివాదాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు విజయ్. ఏ పార్టీతోనూ పొత్తు లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయటానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు విజయ్.
ఈ క్రమంలోనే భార్య సంగీత విడాకుల పిటీషన్ దాఖలు చేయటం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ విషయంపై విజయ్ నుంచి.. టీవీకే పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే ఎన్నికల్లో విజయ్ విడాకుల అంశం.. పార్టీపై.. ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
