ఇంద్రవెల్లి, వెలుగు: పని కోసం ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు రెండు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండాలో జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ అరవింద్ (35), రాథోడ్ ప్రవీణ్ (32) అన్నదమ్ములు. మేస్త్రీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నెల 10న సాలేవాడ గ్రామానికి పనికి వెళ్లి అదే రోజు రాత్రి ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజు 11న మళ్లీ పనికి వెళ్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు.
ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను గ్రామస్తులు గుర్తించి తండ్రి హేమన్రావుకు సమాచారం అందించారు. తన ఇద్దరు కొడుకుల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
