మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం ఒకేరోజు రష్యావ్యాప్తంగా వెయ్యికి పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ అటాక్స్‌తో సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ప్రధాన ఆయిల్ ఎక్స్పోర్ట్ టెర్మినల్, సిటీలోని రుచి ఆయిల్ డిపోలలో భారీగా మంటలు చెలరేగాయని గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ వెల్లడించారు. ఈ భీకర దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రష్యా రిటైల్ దిగ్గజం ఓజోన్ లాజిస్టిక్స్ సెంటర్, టెక్ దిగ్గజం వీకేకు చెందిన డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. అయితే, రష్యాలోని 15 ప్రాంతాలతో పాటు క్రిమియా ద్వీపకల్పం, నల్లసముద్ర తీరం వైపు దూసుకొచ్చిన 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఉక్రెయిన్ ఎంతగా ప్రతిఘటించినప్పటికీ, ప్రస్తుతం సాగుతున్న యుద్ధ గమనాన్ని ఏమాత్రం మార్చలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
మరోవైపు, ఉక్రెయిన్‌లోని జపరోజియా సిటీపై రష్యా జరిపిన వేర్వేరు దాడుల్లో ఒక మహిళ మృతి చెందగా, ఆరేండ్ల చిన్నారి సహా ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడుల్లో 2 అపార్ట్మెంట్ భవనాలు, ఒక విద్యాసంస్థతో పాటు 18 కార్లు ధ్వంసమయ్యాయని జపరోజియా రీజినల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మైఖైలో సెమికిన్ చెప్పారు.
ట్రంప్ ఎనర్జీ సీజ్ఫైర్ ప్రకటనపై అయోమయం
దాదాపు నాలుగున్నరేండ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఎనర్జీ సీజ్‌ఫైర్‌కు రష్యా, ఉక్రెయిన్లు అంగీకరించాయని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 11న ప్రకటించారు. అయితే, దీనికి సంబంధించిన స్పష్టమైన విధివిధానాలను ఆయన వెల్లడించలేదు. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా రష్యా తమ దేశంలోని ఇంధన కేంద్రాలపై దాడులు ఆపలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. దీనికి నిరసనగా గురువారం నుంచి తాము కూడా రష్యా చమురు కేంద్రాలపై తిరిగి దాడులు పునఃప్రారంభించినట్టు స్పష్టం చేసింది.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్ స్కీ ‘ఎక్స్’లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీజ్‌ఫైర్‌కు తొలుత కట్టుబడి ఉన్నప్పటికీ, రష్యా తీరు వల్ల దాడులు చేయక తప్పడం లేదు. ట్రంప్ ప్రకటన చేసిన వారంలోనే రష్యా మా ఇంధన, ఆయిల్, గ్యాస్ సెక్టార్లపై 76 సార్లు దాడులకు తెగబడింది. ఒక్క రాత్రిలోనే నాలుగు ప్రాంతాల్లోని ఇంధన కేంద్రాలు దెబ్బతినడంతో వేలాది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
