డేటా సెంటర్లపై ఉక్రెయిన్ దాడులు: డబ్బులున్నా వాడుకోలేని దుస్థితిలో రష్యా ప్రజలు

డేటా సెంటర్లపై ఉక్రెయిన్ దాడులు: డబ్బులున్నా వాడుకోలేని దుస్థితిలో రష్యా ప్రజలు

రష్యాలో టెక్ దిగ్గజం యాండిక్స్ డేటా సెంటర్లపై ఉక్రెయిన్ జరిపిన దాడులు అక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా అతలాకుతలం చేశాయి. మన దేశంలో గూగుల్ ఎంత కీలకమో.. రష్యాలో 'యాండిక్స్' కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన సంస్థ. చెల్లింపులు, ట్యాక్సీ బుకింగ్‌లు, ఫుడ్ డెలివరీ, క్లౌడ్ స్టోరేజ్, చివరకు ఇళ్ల డిజిటల్ లాకింగ్ సిస్టమ్స్ అన్నీ ఈ కంపెనీపైనే ఆధారపడి ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి ఉక్రెయిన్ జరిపిన వరుస దాడుల్లో యాండిక్స్ ప్రధాన డేటా కేంద్రాలు దెబ్బతినడంతో.. రష్యా ప్రజలు ఒక్కసారిగా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకున్నారు.

డబ్బులున్నా.. చేతికి అందక అరిగోస:
ఈ డిజిటల్ అంతరాయం వల్ల రష్యా ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. యాండిక్స్ పే సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది తమ సేవింగ్స్ అకౌంట్స్, బ్యాంకు బ్యాలెన్స్‌లను యాక్సెస్ చేయలేకపోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన 21 ఏళ్ల ఇరినా అనే యువతి తన అద్దె చెల్లించే సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంది. "నా దగ్గర డబ్బు ఉంది, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. ఆ సమయంలో తిండి కోసం కూడా ఇబ్బంది పడ్డాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరు తమ ఈఎంఐ చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి ఉందని తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ అని వెల్లడించారు.

రోజువారీ పనులన్నీ బంద్.. 
కేవలం ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రమే కాకుండా.. రష్యాలోని ట్యాక్సీ డ్రైవర్లు తమ రోజువారీ సంపాదనను చూసుకునేందుకు, విత్‌డ్రా చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల డిజిటల్ యాక్సెస్ సిస్టమ్స్ అంటే డిజిటల్ తాళాలు మొరాయించడంతో రాత్రి పూట ఇళ్లలోకి వెళ్లలేక జనం అవస్థలు పడ్డారు. స్మార్ట్ హోమ్ అసిస్టెంట్లు సైతం పనిచేయడం మానేశాయి. 

రష్యా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్:
రష్యా తమ దేశంలోని ఇంటర్నెట్, డిజిటల్ వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా ఇంధన కేంద్రాలపై దాడి చేయవద్దని అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో.. ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చి రష్యా డిజిటల్ మౌలిక వసతులను టార్గెట్ చేస్తోంది. యాండిక్స్‌తో పాటు రష్యా అతిపెద్ద బ్యాంకైన 'స్బర్‌బ్యాంక్', టెక్ కంపెనీ 'వీకే' సర్వర్లపై కూడా దాడులు విస్తరించాయి.

యాండిక్స్, క్రెమ్లిన్ స్పందన ఏమిటి?
ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాండిక్స్ ప్రకటించింది. డేటా సెంటర్లు తమ సంస్థకు ఉక్కు గుండె లాంటివని, సేవలను పునరుద్ధరించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. యాండిక్స్ చాలా బలమైన కంపెనీ అని, ఈ కష్టాలను ఎదుర్కొని నిలబడుతుందని పేర్కొన్నారు. మెుత్తానికి ఒక టెక్ కంపెనీపై శత్రుదేశం చేసిన దాడి రష్యాను ఎలా ఉక్కిరిబిక్కిరి చేసిందనే విషయం టెక్నాలజీపై అతిగా ఆధారపడటంతో వచ్చే కష్టాలను కళ్లకు కడుతోంది.